
ప్రజ్ఞాన్ ఓజా
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో రెండు మార్పులు జరిగాయి. ఎస్.శరత్, సుబ్రతో బెనర్జీ స్థానాల్లో ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్లు సెలక్టర్లుగా నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా, రుద్ర ప్రతాప్ సింగ్ (RP Singh) చేరారు.
ముంబైలో ఆదివారం జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సర్వసభ్య సమావేశంలో బోర్డు ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్‌ల నియామకాన్ని ఖరారు చేసింది. కాగా ఖాళీ అయిన సెలక్టర్ల పోస్టులకు ఈ నెల ఆరంభంలో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
అర్హతలు ఇవే
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. సెలక్టర్‌గా ఎంపిక కావాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో కనీసం ఏడు టెస్టులు లేదంటే 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అంతేగాక ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తై ఉండాలి. అంతేకాదు గత ఐదేళ్ల కాలంలో బీసీసీఐకి సంబంధించిన ఏ క్రికెట్ కమిటీలోనూ భాగమై ఉండరాదు.
ఇద్దరూ టీమిండియా బౌలర్లే
ఇక ఒడిశాకు చెందిన 39 ఏళ్ల ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ టెస్టుల్లో 113, వన్డేల్లో 21, టీ20లలో పది వికెట్లు పడగొట్టాడు. 2008 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఓజా.. 2015లో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మరోవైపు.. ఉత్తరప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ ఆర్పీ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 40, 69, 15 వికెట్లు కూల్చాడు. 2005లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆర్పీ సింగ్.. 2011లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు. ఇక 2016లో ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు.
వారికి మొండిచేయి
ఈ నేపథ్యంలో అన్ని అర్హతలు కలిగి ఉన్నందున ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ టీమిండియా జాతీయ సెలక్టర్లుగా ఎంపికయ్యారు. సౌత్ జోన్ నుంచి ఓజా దరఖాస్తు చేసుకోగా.. సెంట్రల్ జోన్ నుంచి ఆర్పీ సింగ్ సెలక్టర్ రేసులో నిలిచాడు. వీరితో పాటు ప్రవీణ్ కుమార్, అమేయ్ ఖురాసియా, ఆశిశ్ విన్‌స్టన్ జైదీ, శక్తి సింగ్ పోటీ పడగా.. ఓజా, ఆర్పీ సింగ్ మాత్రమే సఫలమయ్యారు.
బీసీసీఐ సీనియర్ మెన్ సెలక్షన్ కమిటీ
👉చైర్మన్: అజిత్ అగార్కర్ (వెస్ట్ జోన్)
👉సభ్యుడు: శివ్ సుందర్ దాస్ (ఈస్ట్ జోన్)
👉సభ్యుడు: ఆర్పీ సింగ్ (సెంట్రల్ జోన్)
👉సభ్యుడు: అజయ్ రాత్రా (నార్త్ జోన్)
👉సభ్యుడు: ప్రజ్ఞాన్ ఓజా (సౌత్ జోన్).
చదవండి: ‘పాక్‌తో ఫైనల్... శివం దూబే అవుట్!.. భారత తుదిజట్టు ఇదే!’