
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. ఏడుగురు బ్యాటర్లు చాలని.. నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది.
దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్.. దాయాది పాకిస్తాన్ (IND vs PAK)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
శివం దూబే వద్దు
‘‘నేనైతే శివం దూబే (Shivam Dube) బదులు అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడిస్తా. ఆల్‌రౌండర్ అయిన దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశమే రావడం లేదు. కాబట్టి ఈసారి నేను ఏడుగురు బ్యాటర్లనే ఆడిస్తా. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు.
ఆ స్థానంలో వచ్చిన వాళ్లు 20, 50 పరుగులు చేయాల్సిన అవసరమేమీ ఉండకపోవచ్చు, ఓ బౌండరీ లేదంటే సిక్సర్ బాది పది పరుగులు చేసినా చాలు. కుల్దీప్ ఆ మాత్రమే స్కోరు చేయగలడు.
టీమిండియాదే విజయం
ఏదేమైనా శివం దూబే బంతితో మెరుగ్గా రాణిస్తున్న మాట నిజమే. పాకిస్తాన్‌తో గత మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీశాడు. అయితే, ఫైనల్లో మాత్రం అర్ష్‌దీప్ సింగ్‌కే నా ఓటు. రామ్ లేదంటే రావణ్.. ఎవరు ఆడినా సరే టీమిండియా విజయం సాధించడం మాత్రం ఖాయం’’ అని చిక్కా చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే.. ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. సూపర్-4 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసియా కప్-2025 ఫైనల్‌కు క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఎంపిక చేసుకున్న తుదిజట్టు
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్