
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌లో లీగ్, సూపర్-4 దశలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. తొలుత గ్రూప్-‘ఎ’ మ్యాచ్‌లో భాగంగా ఏడు వికెట్ల తేడాతో ఓడిన పాక్.. తర్వాత సూపర్-4లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
అయితే, సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల తప్పిదాల కారణంగా అదృష్టవశాత్తూ ఫైనల్‌కు చేరుకోగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా (IND vs PAK)తో తలపడేందుకు అర్హత సాధించింది.
ఫొటోషూట్‌కు వెళ్లని సూర్య
ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించడంతో పాటు.. వారితో మైదానంలో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఫైనల్ కోసం జరిగే కెప్టెన్ల ఫొటోషూట్‌కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హాజరు కాలేదని సమాచారం.
అది సూర్యకుమార్ ఇష్టం
ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఈ విషయంపై స్పందించాడు. ‘‘అది పూర్తిగా అతడి (సూర్య) ఇష్టం. అదే అతడి నిర్ణయం. ఒకవేళ రావాలి అనుకుంటే వస్తాడు. లేదంటే లేదు. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అని సల్మాన్ పేర్కొన్నాడు.
గెలిచేది మేమే
ఇక టైటిల్ పోరు గురించి ప్రస్తావన రాగా.. ‘‘మేము గెలుస్తాం. అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. ఒకవేళ మేము ఉత్తమంగా రాణించి.. 40 ఓవర్ల పాటు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే.. ఏ జట్టునైనా ఇట్టే ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.
అదే విధంగా.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరుజట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజం. ఒకవేళ ఒత్తిడి లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుంది. ఏదేమైనా ఈ ఎడిషన్‌లో మేము వాళ్ల కంటే ఎక్కువ తప్పిదాలు చేశాము. అందుకే కొన్ని మ్యాచ్‌లు గెలవలేకపోయాము.
తక్కువ తప్పులు చేసిన వారిదే విజయం
అయితే, ఈసారి ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వారిదే విజయం. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే తప్పకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టగలము’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.
కాగా పాక్‌తో ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే, అభి, తిలక్ ఫిట్‌గానే ఉన్నా.. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది.
ఏదేమైనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేననే టైటిల్ ఫేవరెట్ అని చెప్పడంతో సందేహం లేదు. అయితే, ఫీల్డింగ్ విషయంలో మాత్రం భారత జట్టు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటేనే దాయాదిపై సులువుగా గెలవగలదు.
చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం