ఆఖరి పోరాటం | Asia Cup final today betwen india vs pakistan | Sakshi
Sakshi News home page

ఆఖరి పోరాటం

Sep 28 2025 4:19 AM | Updated on Sep 28 2025 4:22 AM

Asia Cup final today betwen india vs pakistan

నేడు ఆసియా కప్‌ ఫైనల్‌ 

పాకిస్తాన్‌తో భారత్‌ ఢీ  

జోరు మీదున్న టీమిండియా 

సంచలనంపై పాక్‌ గురి 

రా.గం.8.00 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

ఆసియా కప్‌ మొదలై 41 సంవత్సరాలు...వన్డే ఫార్మాట్‌లో 14 సార్లు, టి20 ఫార్మాట్‌లో 2 సార్లు టోర్నీ జరిగింది. ఓవరాల్‌గా భారత్‌ 8 సార్లు విజేతగా నిలిచింది. కానీ ఒక్క సారి కూడా భారత్, పాకిస్తాన్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగలేదు. తాజా టోర్నీలో పాక్‌ జట్టు ప్రదర్శన, తడబాటును చూస్తే ఈ సారి కూడా అది సాధ్యం కాదని అనిపించింది. కానీ పడుతూ లేస్తూ పాక్‌ ఎట్టకేలకు తుది పోరుకు అర్హత సాధించగా...మరో వైపు చక్కటి ఫామ్, అజేయమైన రికార్డుతో ఎదురుగా భారత్‌ నిలిచింది.  

గత రెండు మ్యాచ్‌ల ఫలితం, ఆపై సూర్యకుమార్‌ వ్యాఖ్యలు చూస్తే ఇరు జట్ల మధ్య ‘వైరం’ అనే మాటలో అర్థం లేదు! అయితే టి20 ఫార్మాట్‌లో అనూహ్య ఫలితాలు కొత్త కాదు. టీమిండియా తమ జోరును కొనసాగిస్తూ ఏకపక్ష ఆటతో 9వ సారి చాంపియన్‌గా నిలుస్తుందా... లేక పాకిస్తాన్‌ పాఠాలు నేర్చుకొని కొత్త తరహా ఆటతో పోటీనిస్తుందా అనేది ఆసక్తికరం. ఫలితం ఎలా ఉన్నా అభిమానులకు వరుసగా మూడో ఆదివారం క్రికెట్‌ పండగ ఖాయం.  

దుబాయ్‌: ఆసియా కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తమ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సన్నద్ధమైంది. సరిగ్గా రెండేళ్ల క్రితం వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్‌...ఇప్పుడు టి20 ఫార్మాట్‌లో టైటిల్‌కు గురి పెట్టింది. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. వరుసగా ఆరు విజయాలతో సత్తా చాటిన సూర్యకుమార్‌ సేన సహజంగానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. 

ఇదే జోరు మరో మ్యాచ్‌లో కొనసాగిస్తే ట్రోఫీ మన జట్టు ఖాతాలో పడుతుంది. మరో వైపు పాకిస్తాన్‌ జట్టు అన్ని రంగాల్లో బలహీనంగా ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లపైనే చివరి వరకు శ్రమించి గట్టెక్కిన ఆ జట్టు భారత్‌ను నిలువరించడం అంత సులువు కాదు. దాయాది జట్టు చేతిలో లీగ్, సూపర్‌–4 దశలో ఎదురైన ఓటములు వారికి వాస్తవాన్ని చూపించాయి కూడా. అయితే ఆ జట్టు సంచలనాన్ని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆసియా’లో ఎవరిది పైచేయి కానుందో చూడాలి.  

సూర్య ఫామ్‌పై ఆందోళన... 
శ్రీలంకపై చివరి లీగ్‌ మ్యాచ్‌లో బుమ్రా, దూబేలకు విశ్రాంతినిచ్చినా...ఫైనల్‌ పోరుకు వారిద్దరు తిరిగి రావడం ఖాయం. ఇది మినహా మిగతా జట్టులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. వరుస విజయాల్లో భాగంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లనే మేనేజ్‌మెంట్‌ కొనసాగించే అవకాశం ఉంది. అయితే సూపర్‌–4 దశలో జట్టులో పలు లోపాలు కనిపించాయి. భారత్‌ విజయావకాశాలు అభిషేక్‌ శర్మ ఇచ్చే అసాధారణ ఆరంభంపైనే ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. 

టోర్నీ టాపర్‌గా 309 పరుగులు చేసిన అతడు 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో అదరగొడుతున్నాడు. మరో ఎండ్‌లో గిల్‌ (115 పరుగులు)నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. అభిషేక్‌ దూకుడు ఈ లోటును తెలియనివ్వలేదు. ఈ సారైనా వైస్‌ కెప్టెన్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాలని భారత్‌ కోరుకుంటోంది. మిడిలార్డర్‌లో పాండ్యా తన స్థాయికి తగినట్లు చెలరేగలేదు. అయితే తిలక్, సామ్సన్‌లు రాణించడం సానుకూలాంశం. గత మ్యాచ్‌లో వీరిద్దరి ప్రదర్శన నమ్మకాన్ని పెంచింది. 

బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్న దూబే బ్యాటింగ్‌లోనూ ధాటిని ప్రదర్శించాల్సి ఉంది. అన్నింటికి మించి కెపె్టన్‌ సూర్యకుమార్‌ ఫామ్‌ జట్టులో ఆందోళన పెంచుతోంది. ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 71 పరుగులే చేశాడు. అదీ తన సహజశైలికి భిన్నంగా 108 స్ట్రైక్‌రేట్‌ మాత్రమే ఉండటం అనూహ్యం. వచ్చే వరల్డ్‌ కప్‌ జట్టును నడిపించడం ఖాయమని భావిస్తున్న ప్లేయర్‌ ఇలా విఫలం కావడం ఇబ్బంది పెడుతోంది. ఫైనల్లోనైనా అతను చెలరేగాల్సి ఉంది. 

బౌలింగ్‌లో బుమ్రా మరోసారి కీలకం కానుండగా, పాండ్యా కూడా రాణించడం అవసరం. అయితే మరోసారి మన స్పిన్‌ బలగంపై జట్టు ఆధారపడుతోంది. ఆరుకంటే తక్కువ ఎకానమీతో అత్యధికంగా 11 వికెట్లు తీసిన కుల్దీప్‌ను ఎదుర్కోవడం పాక్‌ బ్యాటర్లకు మళ్లీ కష్టమే. అక్షర్, వరుణ్‌ కూడా ప్రత్యర్థిని కట్టిపడేయగలరు.  

గెలిపించేదెవరు! 
భారత్‌తో పోలిస్తే అన్ని రంగాల్లో పాకిస్తాన్‌ బలహీనంగానే కనిపిస్తోంది. తమ చివరి సూపర్‌–4 మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌తో దాదాపు ఓటమికి చేరువై అదృష్టవశాత్తూ తప్పించుకోగలిగింది. ఇక భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా టీమ్‌ ప్రదర్శన పేలవంగా ఉంది.  అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. 160 పరుగులతో టీమ్‌ టాప్‌ స్కోరర్‌గా ఉన్న ఫర్హాన్‌ ఒక్క మ్యాచ్‌లో అర్ధ సెంచరీ మినహా ప్రభావం చూపలేదు. 

ఫఖర్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోగా... మిగతా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్‌ ఆగా కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను చేసింది 64 పరుగులే. ‘పాక్‌ అభిషేక్‌ శర్మ’ అంటూ కొన్నాళ్ల క్రితం కీర్తించిన సయీమ్‌ అయూబ్‌ ఏకంగా రికార్డు స్థాయిలో 4 డకౌట్‌లతో ఘోర ప్రదర్శన కనబర్చాడు. అయితే మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ అతని స్థానంపై ఎలాంటి ఢోకా లేదు.

వీరందరిలో తుది పోరులో ఎవరు రాణిస్తారనేది చూడాలి. పాక్‌ సాధారణ స్కోరు నమోదు చేయాలన్నా మిడిలార్డర్‌లో తలత్, హారిస్‌లు కనీస ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్‌లో షాహిన్‌ అఫ్రిది ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించినా... భారత్‌ ఓపెనర్లు అతడిని అలవోకగా ఎదుర్కొంటున్నారు. రవూఫ్, అబ్రార్, ఫహీమ్, నవాజ్‌ మన బ్యాటర్లనను అడ్డుకోవడం అంత సులువు కాదు.

పిచ్, వాతావరణం 
దుబాయ్‌లో సాధారణ వికెట్‌. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌కు కూడా అనుకూలం. అయితే రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని పదే పదే రుజువైంది. కాబట్టి టాస్‌ గెలిచిన టీమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయం  

3-7 భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య వన్డే, టి20లు కలిపి ఇప్పటి వరకు 10 ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్‌ 3 గెలవగా... పాకిస్తాన్‌ 7 ఫైనల్‌లలో విజయం సాధించింది.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా. పాకిస్తాన్‌: సల్మాన్‌ (కెప్టెన్ ), ఫర్హాన్, ఫఖర్, అయూబ్, తలత్, హారిస్, అఫ్రిది, నవాజ్, ఫహీమ్, రవూఫ్, అబ్రార్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement