
అనంత్ అంబానీ (Anant Ambani) స్థాపించిన వంతారా (Vantara) సంస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఆలయ ఏనుగుల (Elephants)ను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏనుగుల తరలింపుపై సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.
గుజరాత్ జామ్‌నగర్‌లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.
ఏనుగుల తరలింపులో తప్పులేమీ లేదు, నిబంధనల ప్రకారం జరిగితే సరే. ఏనుగులు బాధపడుతున్నాయ్ అని చెప్పినప్పుడు.. దానికి ఆధారాలేమిటో కూడా పిటిషనర్ చూపించాలి కదా. ఇది దేశ గర్వంగా భావించే విషయం. కాబట్టి దీన్ని తక్కువ చేయకండి. పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలు అస్పష్టమైనవిగా కనిపిస్తున్నాయి. విచారణ కొనసాగించాలంటే, పిటిషనర్లు తమ వాదనలను స్పష్టంగా, ఆధారాలతో సమర్పించాల్సిన అవసరం ఉంది అని కోర్టు అభిప్రాయపడింది.
ఈ క్రమంలో.. వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను అస్పష్టమైనదిగా న్యాయస్థానం తోసిపుచ్చింది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈవిషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
వంతారాలో చట్టాలను పాటించట్లేదని.. విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ.. ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టు (Supreme Court)లో పిల్ దాఖలు చేశాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ..
వంతారా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పారదర్శకత వంటి అంశాల్లో సవ్యంగా ఉందంటూ నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది కూడా. అయితే ఇదంతా బయటి దేశాల నుంచి జరుగుతున్న కుట్ర అని, భారత్ చేస్తున్న మంచి పనులపై జంతువుల వేటను అనుమతించే దేశాలు ఈవిధంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని.. ఈ విషయంలో దర్యాప్తునకు తాము అన్నివిధాలా సిట్‌కు సహకరిస్తామని వంతారా తరఫు న్యాయవాది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.