
2025-26 రంజీ సీజన్‌కు (Ranji Trophy) ముందు జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JSCA) సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న యువ వికెట్‌కీపర్ బ్యాటర్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్‌ను (Ishan Kishan) తమ రంజీ జట్టు (Jharkhand) కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
గత సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్న విరాట్ సింగ్‌ను ఇషాన్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) నియమించింది. అనుకుల్ రాయ్, కుమార్ కుషాగ్ర, ఆర్యమన్ సింగ్ వంటి యువ ప్రతిభావంతులు జట్టులో చోటు దక్కించుకున్నారు. రంజీ ట్రోఫీ 2025-26లో జార్ఖండ్ అక్టోబర్ 15న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో తమిళనాడుతో తలపడనుంది.
రంజీ ట్రోఫీ 2025-26 కోసం జార్ఖండ్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), విరాట్ సింగ్ (వైస్ కెప్టెన్), శరణ్‌దీప్ సింగ్, శిఖర్ మోహన్, కుమార్ కుషాగ్రా, కుమార్ సూరజ్, ఉసాక్ రాయ్, మనీషి, వికాస్ కుమార్, జతిన్ కుమార్ పాండే, వికాస్ సింగ్, ఆదిత్య సింగ్, సాహిల్ రాజ్, శుభమ్ సింగ్, ఆర్యమాన్ సింగ్, రిషవ్ రాజ్
అనూహ్య నిర్ణయం
గత కొన్ని సంవత్సరాలుగా జార్ఖండ్ జట్టులో పెద్దగా కనిపించని ఇషాన్ కిషన్‌ను రానున్న రంజీ సీజన్ కోసం కెప్టెన్‌గా నియమించడంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇషాన్‌ను కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేస్తారని ఆ రాష్ట్ర మాజీలు JSCAను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు JSCA పొంతనలేని సమాధానలు చెబుతుండటం అనుమానాలను బలపరుస్తుంది. రాజకీయ పైరవీల కారణంగా ఇషాన్‌కు కెప్టెన్సీ దక్కిందని కొందరంటున్నారు.
గాయాల తర్వాత మళ్లీ రంగంలోకి..!
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ తరఫున తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకం బాదిన ఇషాన్ కిషన్ ఆతర్వాత దారుణంగా విఫలమయ్యాడు. ఆతర్వాత జూన్‌లో నాటింగ్హమ్‌షైర్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి, రెండు అర్ధశతకాలు చేసి ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత గాయం కారణంగా ఇండియా-ఇంగ్లండ్ టూర్, దులీప్ ట్రోఫీ మిస్ అయ్యాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ ఆ అవకాశం చేజారింది. తాజాగా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఇషాన్.. రంజీ ట్రోఫీలో సత్తా చాటి తిరిగి టీమిండియాకు ఎంపిక కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
చదవండి: Ind vs Pak: అప్పుడు బాయ్‌కాట్ అన్నారు.. ఇప్పుడేమో ఎగబడుతున్నారు..!