
ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఈనెల 14న జరుగనున్న గ్రూప్ స్టేజీ మ్యాచ్ కోసం న్యాయనిర్ణేతల (Match Officials) జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 8) ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) ఎంపిక చేయబడ్డారు. వీరిద్దరికి అంతర్జాతీయ అంపైర్లుగా అపార అనుభవం ఉంది.
రుచిరాకు 160కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో న్యాయనిర్ణేతగా పని చేసిన అనుభవం ఉండగా.. మసుదూర్ 70కి పైగా మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించాడు. రుచిరా 2019 వన్డే వరల్డ్‌కప్, 2022 మహిళల వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో పని చేయగా.. మసుదూర్ 2022 ఆసియా కప్ ఫైనల్లో అంపైర్‌గా వ్యవహరించాడు.
భారత్, పాక్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆసియా కప్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, మైదానంలో వారు తీసుకునే నిర్ణయాలు ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇరు జట్లకు సంబంధించి ఏ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
ఈ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ టీవీ అంపైర్, ఫోర్త్ అంపైర్, మ్యాచ్ రిఫరీ పేర్లను కూడా ప్రకటించింది. టీవీ అంపైర్‌గా అహ్మద్ పక్తీన్ (ఆఫ్ఘానిస్తాన్), ఫోర్త్ అంపైర్‌గా ఇజతుల్లా సఫీ (ఆఫ్ఘానిస్తాన్) వ్యవహరించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఉంటారు.