 
													ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మరో ఓటమి ఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్ జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

కాగా భారత్ నిర్ధేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు 6 వికెట్లు కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలోనే ఊదిపడేశారు. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్ష్.. 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన ఎనిమిదివ ఓవర్‌లో మార్ష్ ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.

అతడితో పాటు ట్రావిస్ హెడ్(15 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
అభిషేక్ ఒంటరి పోరాటం..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం హోబర్ట్ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs SA: రీఎంట్రీలో రిషభ్ పంత్ ఫెయిల్.. భారత్ ఆలౌట్.. .. స్కోరెంతంటే?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
