
తమిళనాడు రాజకీయాల్లో మామూలుగా హీటెక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధిస్తుందంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇవి మరో అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అభిమానులకు సాధారణంగానే మంట పుట్టించాయి.
స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్.. ఎంకే స్టాలిన్‌పై రజినీ కురిపించిన ప్రశంస ఇది. ‘‘స్టాలిన్ తమిళనాట మాత్రమే కాదు భారతీయ రాజకీయాల్లో ఓ ధృవతార. కేంద్రంలోని ప్రభుత్వానికి మాత్రమే కాదు.. పాత, కొత్త ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయన ఓ సవాల్‌గా మారారు. నా స్నేహితుడు తన మార్క్ చిరునవ్వుతోనే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నారు’’ అంటూ ఓ ఈవెంట్‌లో రజినీకాంత్ వ్యాఖ్యానించారు. అయితే..

అన్నింటికీ మించి.. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా తట్టుకునే శక్తి ఉంది ఓ బలమైన కామెంట్ చేశారు. ఈ ఎఫెక్ట్‌తో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఊగిపోతున్నారు. అందుకు కారణం.. రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక్కరోజు ముందు విజయ్ తన రాజకీయ పార్టీకి కీలకమైన ప్రస్థానం ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి ప్రజా యాత్ర (మీట్ ది పీపుల్) ప్రారంభించారు. ఆ సభలో అలవి కాని హామీలిచ్చారంటూ డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తాజా రజినీకాంత్ కామెంట్లు విజయ్‌ను ఉద్దేశించి చేసినవేనన్న చర్చ ప్రముఖంగా నడుస్తోందక్కడ.
దళపతినే అంటారా?..
రజినీ కామెంట్లతో అరవ రాజకీయంలో స్టార్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కామెంట్లు చేసిన టైంలో మరో సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా అక్కడే నవ్వుతూ కనిపించారు. కమల్ ఇప్పటికే డీఎంకే కూటమికి మద్దతు అనే సంగతి తెలిసిందే. దీంతో.. రాజకీయంగా అడుగులు వేయలేని వాళ్లు, సొంతగా పార్టీని నడిపించుకోలేని వాళ్లు.. ఒంటరిపోరుకు సిద్ధమైన విజయ్‌ను విమర్శించడమా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి తోడు..

మొన్నటిదాకా బీజేపీకి సపోర్ట్‌గా మాట్లాడిన రజినీకాంత్.. ఇప్పుడు అనూహ్యంగా డీఎంకేకు అనుకూలంగా మాట్లాడడం ఆయన డబుల్ స్టాండర్డ్‌కు నిదర్శనమని, రీల్‌లో సూపర్‌స్టార్ అయినప్పటికీ రియల్ లైఫ్‌లో రజినీకాంత్ ప్యాకేజీ స్టార్ అని, విజయ్ అలా ప్యాకేజీ స్టార్ ఏనాటికి కాబోరని తిట్టిపోస్తున్నారు.
సూపర్ స్టార్ ట్యాగ్‌తో మొదలై..
స్టార్‌డమ్ పెరిగిపోయే క్రమంలో.. రజనీకాంత్ అభిమానులతో విజయ్ అభిమానుల వైరం మొదలైంది. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అది మరింత ముదురుతూ వస్తోంది. గతంలో సినిమా ఈవెంట్లలోనూ స్టేజ్ మీద రజినీకాంత్ ‘‘కుక్క, కాకి’’ అంటూ ఏవో పిట్టకథలతో తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ సమయంలో విజయ్ అభిమానులు ఆయన్ని టార్గెట్ చేసేవారు. అంతేకాదు స్వయంగా విజయ్ కూడా అంతే సెటైరిక్‌గా తన సినిమా ఈవెంట్లలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

ఈ క్రమంలో.. కిందటి ఏడాది విల్లుపురంలో జరిగిన టీవీకే తొలి మహానాడు తర్వాత రజినీకాంత్ విజయ్‌ను ప్రశంసించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఈలోపే.. రాజకీయాల్లో తన ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ ప్రకటించిన డీఎంకే, స్టాలిన్‌ను రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తడంతో పరిస్థితి మళ్లీ మునుపటికి వచ్చింది.
రజినీ వెనకడుగులు..
1995–1996.. రజినీకాంత్ హవా కొనసాగుతున్న రోజులు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆయన తొలిసారిగా పెదవి విప్పారు. అప్పటి జయలలిత ప్రభుత్వంపై అవినీతి విమర్శలు గుప్పిస్తూ.. డీఎంకేకు మద్దతు ప్రకటించారాయన. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయంలో ఆయన మద్దతూ కీలకంగా మారింది. అయితే..

2000 నుంచి దశాబ్దం పాటు ఆయన రాజకీయాలపై మౌనం పాటించారు. బాబా సినిమా టైంలోనూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం విస్తృతంగా నడిచినప్పటికీ.. ఆయన కేవలం సామాజిక అంశాలపై మాత్రమే స్పందిస్తూ వచ్చారు. దీంతో రజినీ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. చివరకు..
అయితే పాతికేళ్ల అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ.. 2017 డిసెంబర్ 31వ తేదీన రజినీకాంత్ నుంచి రాజకీయ పార్టీ స్థాపన ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. 2020 టైంలో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో తమిళనాట కోలాహాలం నడిచింది. అదే సమయంలో.. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడడం, మరోపక్క కరోనా విజృంభణతో ఆయన వెనకడుగు వేశారు. తన ఆరోగ్య కారణాల రిత్యా రాజకీయ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానులు చల్లబడ్డారు.
అయితే.. అప్పటి నుంచి రాజకీయంగా మాత్రం ఆయన తన అభిప్రాయాలను స్వేచ్ఛగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో కొన్నాళ్ల కిందట ఓ ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విజయ్ సూటిగా..
తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (Thalapathy Vijay).. గత దశాబ్ద కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు వంటి చర్యల ద్వారా రాజకీయంగా చురుకుగా ఉన్నారు. అవినీతి, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తమిళనాడుకు మౌలిక మార్పు అవసరం అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన ఏనాడూ.. ఏ పార్టీకి మద్దతు ప్రకటించింది లేదు. అయితే..
ఆయన అభిమాన సంఘాలు(Vijay Makkal Iyakkam) మాత్రం 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో.. నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలపై ఆయన తన సినిమాల్లో సెటైర్లు ఉండేలా చూడడంతో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకమనే చర్చ నడిచింది. అయితే.. డీఎంకేను రాజకీయ విరోధిగా, బీజేపీని సైద్ధాంతిక విరోధిగా పేర్కొంటూ 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కళగం (TVK) అనే పార్టీని స్థాపించారు.
తాము ఏ కూటమికి చెందిన వాళ్లం కాదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం సింహం సింగిల్‌గానే వస్తుందని.. అధికారం కోసం జరుగుతున్న పోరులో పొత్తు కోసం కలిసొచ్చే పార్టీలకు ఆహ్వానమంటూ బహిరంగంగా చిన్నపార్టీలను ఆహ్వానించారాయన.
ఏమిటీ ప్యాకేజీ గోల?!
అధికార డీఎంకే కుటుంబానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గతకొన్నేళ్లుగా అక్కడి అగ్ర హీరోలతో బిగ్‌డీల్(కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు, బోనస్‌గా కాస్ట్‌లీ గిఫ్ట్‌లు కూడా) కుదుర్చుకుని వరుస ప్రాజెక్టులు చేస్తూ వస్తోంది. ఈ లిస్ట్‌లో రజినీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ఉండడం గమనార్హం. రాజకీయంగా తమ ఎదుగుదలకు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో వాళ్లను ఇలా బుజ్జగిస్తోందని ముమ్మర ప్రచారం నడిచింది.

తమిళనాట తమకు ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ మధ్యే ఎన్నికలు జరగాలని డీఎంకే తొలి నుంచి భావిస్తోంది. రజినీకాంత్ కంటే విజయ్‌కు తమిళనాట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. దీంతో సొంత పార్టీ ప్రకటన కంటే ముందే ఆయన్ను తమ వైపునకు తిప్పే ప్రయత్నమూ డీఎంకే చేసింది. కానీ రాజకీయ అడుగులు వేయాలని బలంగా ఫిక్స్ అయిన విజయ్ ఆ ప్యాకేజీకి ఒప్పుకోలేదని.. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారన్నది ఆ ప్రచార సారాంశం(దీనిని విజయ్ ఫ్యాన్సే నడిపించారనే టాక్ కూడా ఉంది).
ఇక.. ఏడాదిన్నర కాలంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తరచూ విమర్శలు గుప్పించడం.. తాజా మధురై మానాడులో అంకుల్ అని స్టాలిన్‌ను సంబోధిస్తూ విజయ్ విమర్శలు చేయడాన్ని డీఎంకే సీరియస్‌గా భావించింది. ఈ క్రమంలోనే కేసులతో ఇబ్బంది పెడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోందక్కడ. అయితే.. ఇంత సీరియస్ ఆరోపణలపై ఇటు రాజకీయంగా గానీ, అటు సినిమాలపరంగానూ ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!