
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం హైదరాబాద్. అలాంటి నగర వేదికగా కొనసాగుతున్న చేనేత, హస్తకళల ఉత్సవం ‘ఛాప్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కళలకు ఆధునిక హంగులు జోడిస్తూ జరుగుతున్న ఈ అతిపెద్ద కళాత్మక కార్యక్రమం ఈ తరం ఫ్యాషన్, ఇంటీరియర్ ఔత్సాహికులను విశేషంగా అలరిస్తోంది. ఫ్యాషన్–టెక్నాలజీ వంటి అంశాలతో కేంద్ర టెక్స్‌టైల్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ శాఖ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ‘ఛాప్’ సరికొత్త కళను తీసుకొచ్చింది. ఈ నెల 17 వరకూ కొనసాగనున్న ఈ చేనేత, హస్తకళల సందడి.. సిటీ లైఫ్ స్టైల్‌లో మునిగిపోయని నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది.
ఛాప్ 2025లో భాగంగా భారతదేశపు చేనేత, హస్తకళల వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు సమకాలీన డిజైన్ల ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాధాన్యతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలు సందర్శకులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని శిల్పారామం వేదికగా ఏర్పాటు చేసిన 100 స్టాల్స్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు, నిఫ్ట్ పూర్వ విద్యార్థులు, వ్యవస్థాపకులు, డిజైనర్లు, పరిశ్రమల ప్రముఖులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
ఇందులోని లెదర్‌బ్యాగ్స్, వుడ్ కారి్వంగ్, పెయింటింగ్స్ వంటి చేతి ఉత్పత్తులను నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ టూరిజం ప్రాధాన్యతను ప్రదర్శించేలా వినూత్న కార్యక్రమాలు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికేలా నిర్వహిస్తున్న మాస్టర్ క్లాసులు, ఫ్యాషన్ షోలు, విద్యార్థుల పరిశోధనాత్మక డాక్యుమెంటేషన్, అరుదైన కళలు తోలుబొమ్మలాట వంటివి.. ‘ఛాప్’లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రేపటితో ముగియనున్న ఈ ‘ఛాప్’ ప్రదర్శనను సందర్శించకుంటే ఒక తరం కళాత్మక వైభవాన్ని చూసే అవకాశం కోల్పోయినట్లే.
నీడిల్ క్రాఫ్ట్.. వెరీ స్పెషల్..
హిమాచల్ ప్రదేశ్, కాంగ్ర అనే ప్రాంతంలో ప్రత్యేకంగా పిన్ నీడిల్ క్రాఫ్టŠస్‌ను మహిళలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వీటిని నగరవాసులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర రూ.100 నుంచి 20వేల వరకూ అందుబాటులో ఉండటం విశేషం. పర్యావరణహిత ఉత్పత్తులు, స్టోరేజ్ బాక్సులు, పండ్ల బుట్టలు, టిష్యూ బాక్స్, చపాతీ బాక్స్, టేబుల్ మ్యాట్ వంటి అందమైన ఉత్పత్తులు వీరి ప్రత్యేకతను చాటుతున్నాయి.
ప్యూర్ లెదర్.. ఫరెవర్..
అస్సోంకు చెందిన నిఫ్ట్ డిజైనర్ రూపొందించిన ప్యూర్ లెదర్ ఉత్పత్తులకు ఈ స్టాల్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. అస్సోంకు చెందిన డిజైనర్ తమ ఉత్తులకు మరింత మార్కెటింగ్ చేయనున్నట్లు తెలిపారు. వీటి ధర రూ.1000 నుంచి 10వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. టిఫిన్ బ్యాగ్స్, కాలేజ్, ఆఫీస్ బ్యాగ్స్, మహిళల హ్యాండీ బ్యాగ్స్ అదుర్స్ అంటున్నారు సందర్శకులు.
మనసు దోచే.. తుస్సార్ సిల్క్..
ఈ వేదికలో ఒడిస్సాకు చెందిన తుస్సార్ సిల్క్ చీరలు, చున్నీలు, టవల్స్, దోతీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఉత్పత్తుల ధర 8వేల నుంచి 26వేల వరకూ అందుబాటులో ఉన్నాయి.
రాజస్థాన్ ఫేమ్.. ఫ్రేమ్స్..
రాజస్థాన్‌కి చెందిన బికనీర్ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ఈ తరం ఇంటీరియర్ వండర్‌గా నిలుస్తున్నాయి. చేతితో తయారు చేసిన ఫ్రేమ్స్, కళాత్మక ఉత్పత్తులు ట్రెండీ థింగ్స్‌ను మైమరిపిస్తున్నాయి. ఇందులోని 24 క్యారెట్ గోల్డ్, రాజస్థాన్ పెయింటింగ్‌తో తయారు చేసిన లెదర్‌ల్యాంప్ వావ్ అనిపిస్తోంది. దీని ధర రూ.35,000 చెబుతున్నారు!
పంజాబ్ కళాకారులు తయారు చేసిన వుడ్ కారి్వంగ్ ఉత్పత్తలు కళ్లు చెదిరే కళతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి ధరలు రూ.100 నుంచి 50వేల వరకు అందుబాటులో ఉన్నాయి. హోమ్‌డెకార్ ఉత్పత్తులు, క్యాండిల్ స్టాండ్, టేబుల్స్, డిజైనింగ్ పిల్లర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్నా. సొంత బ్రాండ్‌తో ఉత్పత్తులు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నా. నగరవాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. మరిన్ని ప్రత్యేక డిజైన్‌లతో వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చి అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా.
– నిషిగంధ బారువా, నిఫ్ట్ లెదర్ ఫ్యాషన్ డిజైనర్, అస్సోం.
గృహాలంకరణ ప్రత్యేకం..
వెస్ట్‌బెంగాల్ కళాకారులు స్పాంజ్ వుడ్‌వర్క్ ఉత్పత్తులను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని నగరవాసులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. గృహాలంకరణకు ఇవి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి ముందు లాన్, పార్కులో కావాల్సిన ప్రత్యేక డిజైన్స్ తయారు చేసి ఇస్తాము. మా స్టాల్స్‌లో ఉత్పత్తులు రూ.2వేల నుంచి 8వేల వరకు అందుబాటులో ఉన్నాయి.
– సమీర్ కుమార్ షా, కళాకారుడు, వెస్ట్‌బెంగాల్.
ఒక్కో డిజైనింగ్‌కు నెలల సమయం..
పనిలో నైపుణ్యం కలిగివున్నప్పుడే వుడ్ కార్వింగ్ చేయగలం. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్‌లను అందిచాల్సి ఉంటుంది. ఒక్కో కార్వింగ్ ఫ్రేమ్, ఒక్కో డిజైన్ బట్టి కొన్ని నెలల సమయం పడుతుంది. అందంగా కార్వింగ్ చేసినప్పుడే అమ్మకాలు జోరందుకుంటాయి. ఆయా ఉత్పత్తులకు డిమాండ్ కూడా ఉంటుంది.
– కమల్‌జిత్ మాతరో, పంజాబ్ కళాకారుడు