
ఉచిత విద్యుత్ హామీ అమలులోనూ కోతలే
రాష్ట్రంలో సొంత మగ్గం కలిగిన వారు 82 వేల మందిపైనే
82,130 కుటుంబాలకు నేతన్న నేస్తం అందించిన వైఎస్ జగన్
65 వేలమందికే ఉచిత విద్యుత్ ఇస్తామంటున్న కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు జీవోతో సరి
13 నెలల తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు
పథకం అమల్లోకి రాకముందే లబ్ధిదారుల జాబితాలో కోత
ఉచిత విద్యుత్ వెలుగులు అందేది ఎందరికనేది అనుమానమే!
సాక్షి, అమరావతి: చేనేతకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో చంద్రబాబు మార్కు మోసం మరోసారి బట్టబయలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్టు ప్రభుత్వం గొప్పులు చెప్పుకొనేందుకు తప్ప దానివల్ల నేతన్నలకు పెద్దగా లబ్ధి లేదన్నది తేటతెల్లమవుతోంది. 2014 ఎన్నికల్లో చేనేత రంగానికి సుమారు 25 హామీలిచ్చి అమలు చేయని చంద్రబాబుకు... 2024 ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలనైనా నూరు శాతం అమలు చేసేందుకు మనసు రావడం లేదు.
ప్రధానంగా హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల చొప్పున విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమలు ఉత్తర్వులు (జీవో) ఇచ్చారు. సర్వేలు, వడపోతల పేరిట కాలయాపన చేసిన చంద్రబాబు ఆ కార్యక్రమాన్ని జీవో ఇచ్చాక కూడా తీవ్ర తాత్సారం చేసి చివరకు ఈ నెల 7న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ముందే లబ్దిదారుల జాబితాలో కోతలు
మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అసలు పథకం మొదలుకు ముందే అర్హుల జాబితాలో కోతలు పెట్టారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత ప్రారంభిస్తున్న ఈ పథకంలో లబి్ధదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మార్చిలో జీవో ఇచ్చిన ప్రభుత్వం ఉచిత విద్యుత్‌తో 91,300 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించింది.
కానీ, ఇప్పుడు అర్హుల జాబితాను సొంత చేనేత మగ్గాలున్న 50 వేలమందికి, మర మగ్గాలున్న 15 వేలమందికి మొత్తం 65 వేల మందికి కుదించింది. వాస్తవానికి పెన్షన్ పథకంలో 92,724 మంది నేతన్నలకు పింఛను అందుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ సొంత మగ్గం ఉన్న 82,130 మందికి ఏటా రూ.24 వేలు చొప్పున నేతన్న నేస్తం అందించారు. అప్పట్లో చేనేత కార్మికులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న నేస్తంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌లో మెలిక
చేనేత వ్రస్తాలపై జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ (తిరిగి చెల్లింపు) చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ సైతం మోసపూరితమని నేతన్నలు మండిపడుతున్నారు. చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్నులు వేయకూడదని రాజ్యాంగం చెబుతోంది. అయినప్పటికీ చేనేత వస్త్రాలు రూ.వెయ్యిలోపు విక్రయాలపై 5 శాతం, రూ.వెయ్యి దాటితే 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. తయారీదారు షాపులకు విక్రయిస్తే.. వారు వినియోగదారులకు అమ్ముతారు. దీంట్లో వినియోగదారులే జీఎస్టీ చెల్లిస్తారు.
జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు ఈ మొత్తాన్ని ఎవరికి తిరిగి చెల్లిస్తారో స్పష్టత ఇవ్వలేదు. దాని కంటే చేతన వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తే నిజమైన మేలు జరుగుతుందని నేతన్నలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చేనేత సహకార ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం ఏడాదైనా కార్యాచరణ చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి.
నేతన్నకు దన్నుగా వైఎస్ జగన్
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేనేతల కోసం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.3,706 కోట్లకు పైగా వ్యయం చేసింది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు నేరుగా జమ చేసింది.
నేతన్న నేస్తం పథకం ద్వారా మొత్తం రూ.982.98 కోట్లు ఆర్థిక సాయం అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆ చేయూతతో చేనేత కుటుంబాల్లో సగటు ఆదాయం గణనీయంగా పెరిగింది. టీడీపీ హయాంలో 2018–19 మధ్య నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే.. వైఎస్ జగన్ అందించిన ప్రోత్సాహంతో అది మూడు రెట్లు పెరిగి రూ.15 వేలు దాటింది. ఆర్థికంగా నేతన్నలు నిలదొక్కుకున్నారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తం, ప్రత్యేకంగా కోవిడ్ సాయం అందించి వైఎస్ జగన్ అండగా నిలిచారు.
అధికారం కోసం హామీలిచ్చి ఇప్పుడు డబ్బులు లేవనడం దారుణం
మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తే మేలు జరుగుతుంది. పవర్‌లూమ్స్‌కు కూడా 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తే.. మగ్గంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడతాయి. రాష్ట్రంలో దాదాపు 1.77 లక్షల మంది చేనేత కార్మికులున్నారు. వైఎస్ జగన్ 82 వేల మందికి నేతన్న నేస్తం అందిస్తే అప్పుడు మగ్గం కలిగిన అందరికీ ఇవ్వాలని కోరిన టీడీపీ ఇప్పుడు 65 వేల మందికే ఇస్తామనడం దారుణం. అధికారంలోకి రావడానికి ఇష్టానుసారం హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు డబ్బులు లేవని చెప్పడం దారుణం.
– పిల్లలమర్రి బాలకృష్ణ, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చేనేతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి హామీలను త్వరగా అమలు చేసి ఆదుకోవాలి. చేనేత వర్గాలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించాలి. వీవర్స్‌కు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలి. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్