ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్‌ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్‌..! | Gujarats 900-Year-Old Royal Patan Patola Saree | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్‌ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్‌..! అంత ఖరీదా..?

Dec 9 2025 1:46 PM | Updated on Dec 9 2025 3:22 PM

Gujarats 900-Year-Old Royal Patan Patola Saree

భారతీయ చేనేత సంప్రదాయం వేల ఏళ్ల నాటిది. అవి విలాసవంతమైనవి, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి కూడా. కొన్నిటికి వాటి చారిత్రక నేపథ్యం కారణంగా యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ సైతం ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన చేనేత వస్త్రాల్లో ఒకటి గుజరాత్‌కి చెందిన పటాన్‌ పటోలా ఫ్యాబ్రిక్‌. ఈ ఫ్యాబ్రిక్‌ అందానికి రాజీకీయ నాయకుల నుంచి బాలీవుడ్‌ నటుల వరకు అందరూ ఫిదా. అంతలా ఆదరణ పొందుతున్న ఈ పటాన్‌ పటోలా చేనేత వస్త్రం ఎలా కళాకారుల చేతులో రూపుదిద్దుకుంది..? ఎలా పుట్టుకొచ్చింది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.

విభిన్న రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే ఈ పటోలా డబుల్‌ ఇకాట్‌ టెక్నిక్‌ ఉపయోగించి నేస్తారు. వీటిలో రేఖాగణిత మోటీప్‌లు కూడా ఉంటాయి. అదోక విస్తృత కథాఖండం. ఇందులో పూల నుంచి జంతువుల మోటీఫ్‌లు కూడా ఉంటాయి. ప్రతి డిజైన్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

900 ఏళ్ల నాటి చరిత్ర..
12వ శతాబ్దంలో రాజు కుమార్‌పాల ఈ పటోలాను ఇష్టపడ్డాడు. చాలా క్లిష్టంగా ఉండే చేతిపని. ఆయన జైన మతాన్ని స్వీకరించాడు. అందువల్ల ఆలయాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా..అక్కడకు వచ్చే ప్రజలంతా పటోలా వస్త్రాల్లో కనిపించాలని హుకుం జారీ చేసేవాడు. ఈ వస్త్రం మహారాష్ట్రలోని జల్నా నగరం రవాణా అయ్యేది. అయితే ఒకసారి రాజు కుమార్‌పాల ఒక ఆయానికి వెళ్తే..అక్కడ పూజారి మీ దుస్తులు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ లోపలికి వెళ్లనివ్వలేదు. ఒక్కసారిగా అతడి మాటలకు హుతాశుడై ఇలా ఎందుకన్నాడు. అత్యంత విలాసవంతమైన పటోలా పట్టు వస్త్రాలు మాములు దుస్తుల్లా ఎలా కనిపించాయని విచారించగా, అసలు విషయం బయటపడింది. 

జల్నా రాజు పటోలా బట్టలను బెడ్‌షీట్‌లుగా ఉపయోగించేవాడని, వాటిని రాజకుటుంబాలకు బహుమతిగానూ లేదా విక్రయించేవాడని తెలుస్తుంది. దాంతో కుమారపాల్‌ రాజు అతడితో యుద్ధం చేసి గెలిచాక..దాదాపు 700 మంది సాల్వి కళాకారులను, వారి కుటుంబాలను పటాన్‌ తీసుకువచ్చి పటోలా వస్త్రాల్లో కల్తీ లేని నాణ్యమైనవి వచ్చేలా చూశాడు. తన పాలనలో ఆ బట్ట ఉత్పత్తి బాగుండేలా కేర్‌ తీసుకున్నాడు. అలా దీని గురించి తరతరాలకు తెలిసేందుకు దారితీసింది. 

నేయడానికి వ్యవధి కూడా ఎక్కువే..
నిజానికి ఆరు నెలల కాలానికి గానీ ఒక చీర ఉత్పత్తి అవ్వదట. అంత సంక్లిష్టమైన చేతి పనితో కూడిన చేనేత వస్త్రం ఇది. అందుకు సంబంధించిన ఆధారాలు అజంతాలోని ఫ్రెస్కోలు, పద్మనాభపురం రాజభవనాల మీద లిఖిత పూర్వకంగా చెక్కబడి ఉన్నాయట కూడా. ముఖ్యంగా కేరళ గోడ చిత్రాల్లో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుందట. అంటే ఈ పటోలా చీరలు దగ్గర దగ్గర వెయ్యి ఏళ్ల నాటివిగా పేర్కొనవచ్చు. 

సాల్విస్‌, సోనిస్‌ అనే రెండు వర్గాల వారికే ఈ పటోలా చేనేత నైపుణ్యం తెలుసట. గుజరాతీలోని పాత స్మారక చిహ్నాలలో ఉన్న క్లిష్టమైన గోడ డిజైన్ల ద్వారా ప్రేరణ పొందిన చతురస్రాకార నమూనాల్లో కూడా ఈ పటోలా వస్త్రాల్లో చూడొచ్చు. ఈ చేనేత వస్త్రంలోని చిహ్నాలు చాలామటుకు సంతానోత్పత్తి, శక్తి, అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉండటం విశేషం. అందుకే గుజరాతీ మహిళలు శుభ సందర్భాల్లో తప్పనిసరిగా ఈ వస్త్రాలను ధరిస్తారట. 

డిజైన్‌ రూపొందించడానికే మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందట. ఇక నేయడానికి ఏకంగా 40 నుంచి 50 రోజుల పడుతుందట. కనీసం ఇద్దరు కార్మికులు ఈ చీరపై ఎనిమిది నుంచి 9 గంటలు కూర్చొంటే గనుక ఇది పూర్తవ్వుతుందట. ఇప్పటకీ ఒక సాధారణ పటోలాను పూర్తిచేయాలన్న కనీసం ఐదు నెలల వ్యవధి పడుతుందట. 

అందుకే అంత ఖరీదు..
అందువల్లే ఈ పటోలా చీరలు అంత ఖరీదు పలుకుతాయట. మార్కెట్లో అచ్చం అలాంటి నకిలీ ఫ్యాబ్రిక్‌ పటాన్‌ పటోలా వచ్చేస్తున్నాయి. అయితే అవి రూ. 2000 నుంచి రూ. 3000లు పలుకుతాయి. నాణ్యమైన ఒరిజనల్‌ పటోలా పట్టు చీర మాత్రం రూ. 1,50,000 నుంచి దగ్గర దగ్గర 3,50,000 వరకు పలుకుతుందట. అంతేగాదు వీటిని మలైకా అరోరా, స్మృతి ఇరానీ,  దీపికా పదుకొనే, సోహా అలీ ఖాన్, కరిష్మా తన్నా, కంగనా రనౌత్, భూమి పెడ్నేక్కర్, మాధురి దీక్షిత్‌లు ఎంతో ఇష్టంగా ధరిస్తారట. అలాగే మన ప్రధాని మోదీ సైతం దీన్ని ఇష్టపడతారు. ఆయన జూలై 2022 లో పటోలా స్కార్ఫ్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

 

 

 

 

(చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement