
నేడు జాతీయ చేనేత దినోత్సవం
చేనేత రంగంలో 70 శాతం శ్రమ మహిళలదే. బ్లీచ్ చేయడం, ఆసుపోయడం, డిజైన్ కట్టడం, రంగులద్దడం, ఆసు మిషన్ మీద దారాలను అమర్చడం, చిటికి కట్టడం, కండె చుట్టడంతోపాటు వార్ప్ వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. మగ్గం మీద నేత ప్రధానంగా మగవాళ్లు చేస్తారు. ఆసక్తి ఉన్న మహిళలు కూడా నేస్తారు. మహిళ సహాయం లేనిదే మగ్గం మనుగడ సాగదు. నేతకారులకు సహాయకులుగా, స్వయంగా నేతకారులుగా, డిజైనర్‌లుగా, బిజినెస్ విమెన్, కమ్యూనిటీ లీడర్‌లుగా కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇది స్కిన్ ఫ్రెండ్లీ
సంప్రదాయ చేనేతను మోడరన్ బిజినెస్‌గా మారుస్తూ చేనేతరంగానికి దోహదం చేస్తున్న మహిళల్లో స్వాతి మఠం ఒకరు. ఐఐటీ బాంబేలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డెలాయిట్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగం చేసిన స్వాతి ప్రస్తుతం చేనేతరంగంలో కెరీర్‌ను విజయవంతం చేసుకున్నారు. తన పాపాయికి ఒంటికి మెత్తగా ఉండే దుస్తులు కావాలి, వాటికి ఫంక్షన్ లుక్ ఉండాలి, బ్రైట్‌గా కలర్‌ఫుల్‌గా ఉండాలి. ఎన్ని షాపులు తిరిగినా ఈ లక్షణాలన్నీ ఒక డ్రస్‌లో దొరకకపోవడంతో సొంతంగా నారాయణపేట్ మెటీరియల్‌తో స్వయంగా డిజైన్ చేశారామె.
ఆ ప్రయత్నమే ఆమెను ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది. హ్యాండ్‌లూమ్ ప్రమోటర్‌గా గుర్తింపునిచ్చింది. చేనేత వస్త్రాలను ఫ్యాషనబుల్ డిజైనర్‌వేర్‌గా తీర్చిదిద్దడం ఆమె ప్రత్యేకత. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన కొత్తతరం యువతులు ఆమెతో పని చేస్తున్నారు. క్రియేటివ్ డిజైన్‌కు చేనేతను మించిన ఫ్యాబ్రిక్ మరొకటి ఉండదని చెబుతున్నారీ యువతులు. శ్రీకాళహస్తి కలంకారీ పనితనాన్ని ప్రపంచదేశాలకు విస్తరింపచేస్తున్నారు వాళ్లు. మిస్ ఇండియా పోటీలకు హైదరాబాద్‌కు వచ్చిన బ్యూటీ పాజంట్‌లకు చేనేత డ్రెస్‌లు డిజైన్ చేశారు.
మన చేనేతకు ప్రశంసలు
ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లో డిజైనర్ వేర్ యూనిట్‌ను ముగ్గురితో ప్రారంభించాను. కొన్నాళ్లకు దానికి సిస్టర్ ఆర్గనైజేషన్‌గా చేనేతలతో క్యాజువల్ వేర్ యూనిట్ ప్రారంభించాను. ఇప్పుడు 90 మందికి జీతాలిస్తున్నాను. ఒకప్పుడు చేనేత అంటే చిన్నచూపు ఉండేది, కానీ ఇప్పుడు చేనేత దుస్తులు ధరించడానికి సెలబ్రిటీలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. రెండు యూనిట్స్‌కి అవసరమైన రా మెటీరియల్ కోసం నెలకు ఆరేడు లక్షల రూపాయలు చేనేతకారులకు ఇస్తున్నాం. చేనేతను విశ్వవ్యాప్తం చేయడంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది.
– స్వాతి మఠం, హ్యాండ్‌లూమ్ ప్రమోటర్
మగ్గం ఇంజనీరింగ్ అద్భుతం
మగ్గంతో ఇంద్రధనస్సులాంటి రంగుల జీవితాన్ని ఎంచుకున్న వాళ్లలో తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లికి చెందిన నవనీత ఒకరు. ఆమె తొలిసారి మగ్గాన్ని చూసింది అత్తవారింట్లో. మగ్గం వెనుక హిడెన్ ఇంజనీరింగ్ ఉంది. పాదంతో తొక్కితే ఒక కదలికకు అనుబంధంగా ఆరు చోట్ల కదులుతూ దారం వస్త్రంగా రూపుదిద్దుకుంటుంది. ఆసక్తిగా అనిపించి భర్త దగ్గర నేత పని నేర్చుకున్నారామె. గత తరం మహిళలు ఇంటి నాలుగ్గోడల మధ్య సహాయకపనులకే పరిమితమయ్యారు. ఈ తరం నేతకార మహిళలు వస్త్రాలను వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాలో మార్కెట్ చేస్తున్నారు. రీటైలర్స్, బొటిక్ నిర్వహకులతో సమన్వయం చేసుకుంటున్నారు. చీర మగ్గం మీద ఉండగానే ఫొటోలు అప్‌లోడ్ చేయడంతో చీర పూర్తయ్యేలోపు కొనేవాళ్లు సిద్ధంగా ఉంటున్నారు.
బ్యూటీ పాజంట్స్‌కు దుపట్టా
‘‘వియ్‌హబ్‌లో సభ్యత్వం తీసుకోవడంతో నా ఉత్పత్తులకు మంచి కూడలి లభించింది. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన బ్యూటీ పాజంట్‌లకు బహూకరించడానికి పాతిక ఇకత్ దుపట్టాలిచ్చాను. ప్రభుత్వం ఈ కళను ఒక కోర్సుగా రూ΄÷ందించి కొత్తతరం చేనేతకారులకు శిక్షణనిస్తే ఈ కళను మరింత సమగ్రంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా మామయ్యకు తెలిసిన కళలో నా భర్త నేర్చుకున్నది సగమే. తరానికీ తరానికీ జ్ఞానం లుప్తమై పోకుండా మరింతగా విస్తరింపచేయాలి.’’
– నవనీత, వీవర్స్ క్లబ్ హ్యాండ్‌లూమ్స్
అత్త నేర్పించింది
తెలంగాణ, నారాయణపేట జిల్లా పుల్లంపల్లికి చెందిన శృతిక... తన అత్తగారి దగ్గర మగ్గం పని నేర్చుకున్నారు. గతంలో చేనేత ఏ మాత్రం గిట్టుబాటు అయ్యేది కాదు. చేనేతను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తర్వాత పరిస్థితులు మెరుగయ్యాయి. ఆన్‌లైన్ క్లాసులు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లతో చేనేతకారులు మెళకువలు నేర్చుకుంటున్నారు. చీరల దగ్గరే ఆగిపోకుండా చుడీదార్, లంగాఓణీ సెట్‌లు డిజైన్ చేస్తున్నారు.
నెలకు 30 వేలు
చేనేతను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఎగ్జిబిషన్‌లను నిర్వహిస్తోంది. మహిళాశక్తి బజార్ మాకు ఉపయోగంగా ఉంది. ఎగ్జిబిషన్‌లో స్టాల్, బస ఉచితం. నేను ఢిల్లీ, కోల్‌కతా, ముంబయిలో కూడా స్టాల్ పెట్టాను. ఇల్లు దాటి బయటకు రావడం చేతకాని మాలాంటి వాళ్లకు ఈ సౌకర్యాలు బాగా ఉపయోగపడుతున్నాయి. మంచి చీర నేస్తే మాకు పదివేలు మిగులుతాయి. గట్టిగా పని చేస్తే నెలకు మూడు చీరలు నేయవచ్చు. సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతున్నాం. మాకు పని కల్పించడం కోసం... ప్రభుత్వం ప్రముఖులకు సత్కారం చేసే శాలువాల ఆర్డర్‌లు కూడా భారీగానే ఇస్తోంది.
– శృతిక, చేనేతకారిణి, శ్రీ భక్త మార్కండేయ టెక్స్‌టైల్స్
– వాకా మంజులారెడ్డి