
భారత ఔట్ డేటెడ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (Rahul Chahar) ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో తన తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ 2025లో (County Championship) సర్రే (Surrey) తరఫున అరంగేట్రంలోనే 10 వికెట్లు (హ్యాంప్‌షైర్‌పై) తీసి, 1859లో నమోదైన 166 ఏళ్ల పురాతన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ చాహర్ తొలి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీశాడు.
119 ఏళ్ల సర్రే కౌంటీ చరిత్రలో తొలి మ్యాచ్‌లోనే 8 వికెట్ల ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గానూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1859లో విలియన్ ముడీ నార్త్‌పై తన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. హ్యాంప్‌షైర్‌తో మ్యాచ్‌లో 118 పరుగులిచ్చి 10 వికెట్లు తీసిన చాహర్.. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో తొలిసారి 10 వికెట్ల ఘనత సాధించడంతో పాటు అత్యుత్తమ గణాంకాలను కూడా నమోదు చేశాడు.
చాహర్ అద్భుత ప్రదర్శనతో చెలరేగడంతో హ్యాంప్‌షైర్‌పై సర్రే 20 పరుగుల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చాహర్ (24-7-51-8) రెచ్చిపోయాడు. రెండు వికెట్లు మినహా హ్యాంప్‌షైర్ మొత్తాన్ని కూల్చేశాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సహచర భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేయడం విశేషం. ఈ సీజన్‌లో సుందర్ హ్యాంప్‌షైర్‌కు ఆడుతున్నాడు.
2021 టీ20 వరల్డ్ కప్‌లో చివరిసారి టీమిండియాకు ఆడిన చాహర్.. భారత్ తరఫున ఓ వన్డే, 6 టీ20లు ఆడాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా ఆడుతున్న చాహర్.. 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ టైటిల్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సహా పంజాబ్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు ఆడిన చాహర్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు.