సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్ బ్లూ చతికలపడింది. 35 ఓవర్లు ఎదుర్కొని కేవలం 90 పరుగులకే భారత్ కుప్పకూలింది. బౌలర్లకు స్వర్గధామంగా మారిన ఈడెన్ గార్డెన్స్ వికెట్‌పై భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. సౌతాఫ్రికా స్పిన్నర్లు సైమర్ హార్మర్, కేశవ్ మహారాజ్ బంతితో మ్యాజిక్ చేశారు.
భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(31) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. వారు కూడా భారత బౌలర్ల ధాటికి విల్లవిల్లాడారు. ఈ మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా స్కోర్ 200 పరుగుల మార్క్ దాటలేదంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై భారత మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"టెస్టు మ్యాచ్ చూడటానికి ఈడెన్ గార్డెన్స్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం చూసి నేను నేను చాలా సంతోషించాను. కానీ పిచ్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్‌కు గురిచేసింది. తొలుత టాస్ గెలిచి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ బాగా ఆడుతుందని నేను అనుకున్నాను. కానీ మన జట్టు కూడా అదే తీరును కనబరిచి 189 పరుగులకే ఆలౌట్ అయింది. 30 పరుగుల ఆధిక్యం లభించింది.
అయితే ఇటువంటి పిచ్‌పై 30 పరుగుల లీడ్ 300 పరుగులగా పరిగణించాలి. అనంతరం సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి 93 పరుగులతో ఉంది. దీంతో భారత్ సునాయసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ మూడో రోజు వికెట్ మరి వింతగా ప్రవర్తించింది.
ఇటువంటి పిచ్‌లు టెస్టు క్రికెట్ ఉనికిని నాశనం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఆడనుంది. అక్కడ ఇరు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయి. ప్రేక్షకులకు అసలైన టెస్టు క్రికెట్ మజాను అందించాయి. ఐదు రోజుల వరకు మ్యాచ్ జరిగేది. కానీ ఇక్కడ మాత్రం పిచ్ భయంకరంగా ఉంది. బంతి ఎక్కడ పడుతుందో, ఎలా టర్న్ అవుతోంది బ్యాటర్ అస్సలు అంచనా వేయలేకపోయాడు.
మీకు ఎంత మంచి బ్యాటింగ్ టెక్నిక్ ఉన్న కూడా ఈ వికెట్‌పై ఆడలేరు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి లాంటి గొప్ప క్రికెటరైనా ఈ పిచ్‌పై ఫెయిల్ అయ్యే వారు. ఓ బంతి ఎక్కువ ఎత్తులో పడి ఒక్కసారిగా టర్న్ అవుతోంది. మరొకొన్ని సార్లు తక్కువ ఎత్తులో ఉండి స్పిన్ అవుతుంది.
ఈడెన్‌లో ఇంతకుముందు చాలా టెస్టులు జరిగాయి. ఇప్పటివరకు మాత్రం ఇలాంటి కండీషన్స్‌ను చూడలేదు. టెస్టు క్రికెట్ పరువు తీస్తున్నారు" అని తన యూట్యూబ్ ఛానల్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ గిల్ గాయపడడం కూడా భారత ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మెడ నొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే గిల్ వైదొలిగాడు.
చదవండి: పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్‌ఫ్లాప్.. టీమిండియా ఓటమి


