సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను టీమిండియా ఓటమి (IND vs SA)తో ఆరంభించింది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా నిలిచింది.
అందుకే ఓడిపోయాం
ఈ నేపథ్యంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Risbah Pant) ఓటమిపై స్పందించాడు. ఒత్తిడిలో తాము చిత్తయ్యామని పేర్కొన్నాడు. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే వాళ్లమని తమ వైఫల్యాన్ని అంగీకరించాడు.
వాళ్లిద్దరు అద్భుతం
ఈ మేరకు.. ‘‘124 పరుగుల టార్గెట్‌ను మేము ఛేదించి ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్‌లో మాపై ఒత్తిడి బాగా పెరిగింది. అయితే, మేము దానిని అధిగమించలేకపోయాము. తెంబా, బాష్.. అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. తమ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేసుకున్నారు.
ఇలాంటి పిచ్‌పై 120 పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. అయితే, మేము మాత్రం ఈ విషయంలో సఫలం కాలేకపోయాము. మ్యాచ్ ఇప్పుడే ముగిసింది. ఫలితాన్ని విశ్లేషించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు.
బవుమా ఫిఫ్టీ.. నిలబడిన బాష్
కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోయింది. 93/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన సఫారీ జట్టుకు కెప్టెన్ తెంబా బవుమా, టెయిలెండర్ కార్బిన్ బాష్ అద్భుత బ్యాటింగ్‌తో మెరుగైన స్కోరు అందించారు.
తొలి ఇన్నింగ్స్(3)లో విఫలమైన బవుమా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విలువైన అజేయ అర్ధ శతకం (136 బంతుల్లో 55) బాదాడు. మరోవైపు.. బాష్ 37 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 79 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా సౌతాఫ్రికా 153 పరుగులు చేయగలిగింది.
ఆది నుంచే తడబాటు
ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 30 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించినందున.. విజయ లక్ష్యం 124 పరుగులుగా మారింది. అయితే, లక్ష్యఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), యశస్వి జైస్వాల్ (0) పూర్తిగా విఫలం కాగా.. ధ్రువ్ జురెల్ (13), రిషభ్ పంత్ (2) నిరాశపరిచారు.
ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. రవీంద్ర జడేజా (18), అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఆఖర్లో కుల్దీప్ యాదవ్ (1), సిరాజ్ (0) చేతులెత్తేయగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అబ్సెంట్ హర్ట్ కావడంతో టీమిండియా ఆలౌట్ అయింది.
కాగా మెడనొప్పి వల్ల తొలి ఇన్నింగ్స్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ పంత్.. తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.
చదవండి: పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్‌ఫ్లాప్.. టీమిండియా ఓటమి


