కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది.
పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 31) మినహా మిగితా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలదొక్కకోలేకపోయారు. తొలి రోజు మొదటి సెషన్ నుంచే పిచ్‌పై బౌన్స్ కనిపించింది. ఆ తర్వాత రెండో రోజు ఆటలో పిచ్‌పై పగుళ్లు ఏర్పడి, స్పిన్నర్లకు అనుకూలంగా మారింది.
దీంతో స్పిన్నర్లు బంతి గింగిరాలు తప్పారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా సైతం నాలుగు వికెట్లు సాధించాడు. ఈ మొదటి టెస్టులో నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 594 పరుగులు మాత్రమే నమోదయ్యాయి అంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇటుంటి పిచ్‌ల వల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. కాగా ఈ పిచ్‌ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ తాయారు చేశాడు. దీంతో గంభీర్‌ను కూడా నెటిజన్లు టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు. కోచ్‌గా అతడిని తీసేయండి కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాటర్లే కొంప ముంచారు..
ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందించాడు. తామే ఇటువంటి పిచ్‌ను కోరుకున్నట్లు గంభీర్ ధ్రువీకరించాడు. "మేము అడిగిన పిచ్‌ను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. మేము ఎప్పటి నుంచో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూస్తున్నాము. క్యూరేటర్ మాకు అన్ని విధాల సహకరించారు.
అయితే ఈ వికెట్‌పై మేము మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాము. అందుకే ఓడిపోయాము. ఇది మరి బ్యాటింగ్‌కు కష్టతరమైన వికెట్ కాదు. ఇటువంటి పిచ్‌లు మీ టెక్నిక్, సహనాన్ని పరీక్షిస్తాయి. మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే, ఇలాంటి వికెట్‌పై కూడా పరుగులు సాధించవచ్చు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా- 159 &153
భారత్- 189 &93.
చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్


