breaking news
eden garden pitch
-
ఈడెన్ పిచ్ పై ధోని అసంతృప్తి
కోల్ కతా: గతంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలాసార్లు ఈడెన్ గార్డెన్ పిచ్ తయారీని తప్పుబట్టిన మహేంద్ర సింగ్ ధోని.. తాజాగా మరోసారి ఆ పిచ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో భాగంగా బుధవారం సౌరాష్ట్ర-జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఇరు జట్లు నమోదు చేసిన మొత్తం స్కోరు 208 పరుగులు కాగా, 52.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దీనిపై పిచ్ క్యూరేటర్ సుజాన్ ముఖర్జీని ధోని ప్రశ్నించాడు. ఆ మ్యాచ్ లో జార్ఖండ్ 42 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ ఆట జరిగిన తీరుపై మాత్రం ధోని తీవ్ర అసృంతప్తిగా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత ఇరు జట్ల ఆటగాళ్ల కరాచలనం కార్యక్రమం తరువాత ధోని నేరుగా క్యూరేటర్ ముఖర్జీ దగ్గరకు వెళ్లాడు. దీనిలో భాగంగా అతనితో ఐదు నిమిషాలు సమావేశమైన ధోని.. పిచ్ చాలా పేలవంగా తయారు చేశారంటూ ప్రశ్నించాడు. ప్రధానంగా 53 ఓవర్లలోపే 20 వికెట్లు పడిపోవడాన్ని క్యూరేటర్ దృష్టికి ధోని తెచ్చాడు.మరొకవైపు జార్ఖండ్ కోచ్ రాజీవ్ కుమార్ కూడా పిచ్ తయారు చేసిన తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. ఇదొక పూర్ పిచ్ అంటూ బాహాబాటంగా విమర్శించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 27.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తరువాత సౌరాష్ట్ర 25.1 ఓవర్లలో 83 పరుగులకే చాపచుట్టేసింది. ఇదిలా ఉంచితే, పిచ్ పై వస్తున్న విమర్శలపై క్యూరేటర్ ముఖర్జీ స్పందించాడు. 'ఇక్కడ సీమింగ్ ట్రాక్ ను తయారు చేయమని అడిగారు. దాంతో పిచ్ ను ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే విధంగా తయారు చేయాల్సి వచ్చింది. మా గ్రౌండ్ మెన్ పిచ్ ను పూర్తిగా పొడిగా తయారు చేసిన తరువాత నీటితో తడిపి కవర్లతో కప్పి ఉంచారు. ఇలా చేస్తే బంతి బాగా స్వింగ్ అవుతుంది. ఆ క్రమంలోనే తక్కువ స్కోర్ల మ్యాచ్ ను చూడాల్సి వచ్చింది. ఈ పిచ్ తో నేను కూడా సంతృప్తిగా లేను. చాలా ఎక్కువగా సీమ్ కావడంతో పిచ్ పేలవమైనదిగా మారిపోయింది. గతంలో ధోని నుంచి ఎప్పుడూ నాకు ఫిర్యాదు అందలేదు పిచ్ లో తేమ లేకపోవడంతోనే బంతి విపరీతంగా స్వింగ్ అయ్యింది. తదుపరి మ్యాచ్ కు పిచ్ బాగుంటుంది' అని ముఖర్జీ సమర్ధించుకునే యత్నం చేశాడు. -
'ఈడెన్ గార్డెన్ పిచ్ ను తవ్వేస్తాం'
కోల్‌కతా: వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై ఇంకా నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ వేదిక ధర్మశాల నుంచి కోల్ కతాకు మారినా మరోసారి పాత కథే పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్ ను కోల్ కతాలో జరిగితే పిచ్ ను తవ్వేస్తామంటూ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(ఏటీఎఫ్‌ఐ)హెచ్చరించింది. భారత్ పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడం ఎంతవరకూ సబబని ఏటీఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు విరేష్ షాండిల్యా ప్రశ్నించారు. 'పాకిస్తాన్ జట్టు భారత్ కు వస్తే ఇక్కడి సాహస సైనికులను అవమానపరిచనట్లే. ఈడెన్‌లో మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మ్యాచ్‌ను జరపాలని తలిస్తే పిచ్‌ను తవ్వేస్తాం'అని విరేష్ షాండియ్యా హెచ్చరించారు. దాదాపు పది రోజుల పాటు అనేక మలుపులు తిరిగిన అనంతరం వేదిక మార్పు అంశం బుధవారం ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ధర్మశాలలో అయితే తాము ఆడటానికి సిద్ధంగా లేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ వేదికను ధర్మశాల నుంచి కోల్ కతా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ప్రస్తుతం ఏటీఎఫ్‌ఐ నుంచి తీవ్ర నిరసన గళం వినిపిస్తుండటంతో పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.