
దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియాకు, ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విదేశీ లీగ్‌ల్లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. ఈ మేరకు గత కొద్ది రోజులుగా భారీ కసరత్తు చేశాడు. అశ్విన్ విదేశీ లీగ్‌ల భవితవ్యంపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. అశ్విన్ ఈ ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20), బిగ్‌బాష్ లీగ్‌ల్లో (BBL) పాల్గొంటాడు. తొలుత అశ్విన్ ఈ రెండు లీగ్‌ల్లో ఏదో ఒకదాంట్లో మాత్రమే పాల్గొంటాడని ప్రచారం జరిగింది. ఎందుకుంటే ఈ రెండు లీగ్‌ల షెడ్యూల్స్ క్లాష్ అవుతున్నాయి.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ డిసెంబర్ 2 నుంచి వచ్చే ఏడాది జనవరి 4 వరకు జరుగనుండగా.. బిగ్‌బాష్ లీగ్ డిసెంబర్ 14 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 వరకు జరుగుతుంది.
అయితే ఎలాగైనా రెండు లీగ్‌ల్లో ఆడాలని నిశ్చయించుకున్న అశ్విన్.. తొలుత ILT20 ఆడి, ఆతర్వాత వీలును బట్టి బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొంటాడు. బిగ్‌బాష్ లీగ్‌లో అశ్విన్‌కు విపరీతమైన గిరాకీ ఉంది. అతని కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి.
సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్, హోబార్ట్ హరికేన్, అడిలైడ్ స్ట్రైకర్స్ ఫ్రాంచైజీల నుంచి ఇదివరకే ఆఫర్లు వచ్చాయి. వీటిలో ఒకదానిని ఎంపిక చేసుకుంటాడు.
బీబీఎల్ ఆఫర్ల తర్వాత అశ్విన్‌కు ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లోనూ భారీ గిరాకీ ఏర్పడింది. రాబోయే సీజన్‌కు ILT20లో డైరెక్ట్ ఎంట్రీ అవకాశం లేకపోవడంతో, అక్టోబర్ 1న జరిగే వేలంలో పాల్గొనేందుకు అశ్విన్ తన పేరును నమోదు చేసుకున్నాడు.
ఈ లీగ్‌లో ఎవరికీ కేటాయించని బేస్ ధరను అశ్విన్‌కు కేటాయించారు. అశ్విన్ కోసం భారత కరెన్సీలో రూ. 1.06 కోట్ల నుంచి వేలం మొదలవుతుంది. ఈ సీజన్‌లో ఏ ఆటగాడికి ఇంత బేస్ ధర దక్కలేదు. ఈ సీజన్ వేలంలో ఆరంకెల బేస్ ప్రైజ్‌తో పోటీపడనున్న ఏకైక ఆటగాడు అశ్విన్ మాత్రమే.
బేస్ ధరనే ఇంత ఉందంటే అశ్విన్‌కు వేలంలో ఊహించని ధర దక్కే ఛాన్స్ ఉంది. ఈ లీగ్ చరిత్రలో అత్యధిక ధర రికార్డు పాకిస్తాన్ ఆటగాడు షాహీన్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిదిని డెజర్ట్ వైపర్స్ రూ. 3.3 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ వేలంలో అశ్విన్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఐపీఎల్ తర్వాత అత్యధిక వేతనాలు ఇచ్చే లీగ్‌గా ILT20కి పేరుంది.
ఇదిలా ఉంటే, అశ్విన్ ILT20, BBL కమిట్‌మెంట్స్ తర్వాత USAలోని Major League Cricket (MLC), UKలోని The Hundred లీగ్‌ల్లోనూ పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.
చదవండి: టీమిండియాకు అక్షింతలు