
తాజాగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఓ వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఓ ఐసీసీ నియమాన్ని ఉల్లఘించింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేసింది. దీనికి గానూ టీమిండియాకు అక్షింతలు పడ్డాయి. నిర్దేశిత సమయంలోగా భారత్ రెండు ఓవర్లు వెనుక పడింది.
ఇందుకు భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో 10 శాతం కోత విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశిత సమయంలోగా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్‌కు 5 శాతం చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో కోత విధిస్తారు.
ఈ మ్యాచ్‌లో భారత్ విషయంలో ఇదే జరిగింది. ఆ మ్యాచ్ రిఫరీ జీఎస్ లక్ష్మీ భారత ఆటగాళ్లపై జరిమానాను పురమాయించారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జరిమానాను స్వీకరించారు.
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన ఆ మ్యాచ్‌లో (మూడో వన్డే) భారత్‌పై ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బెత్ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది.
అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. స్మృతి మంధన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత శతకంతో విజృంభించినా, లక్ష్యానికి 44 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్‌బై చెప్పేసి..