
టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భారత్-‘ఎ’ కెప్టెన్సీతో పాటు.. జట్టు నుంచి కూడా వైదొలిగాడు. కాగా భారత జట్టు స్వదేశంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు (IND A vs AUS A)తో రెండు అనధికారిక టెస్టు సిరీస్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శ్రేయస్ అయ్యర్‌ను నియమించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో అతడి సారథ్యంలో ఆసీస్‌తో తొలి అనధికారిక టెస్టును భారత్ డ్రా చేసుకుంది.
కెప్టెన్సీకి, జట్టుకు గుడ్‌బై
అయితే, బ్యాటర్‌గా మాత్రం అయ్యర్ విఫలమయ్యాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
ఇక భారత్- ఆసీస్ మధ్య లక్నోలో మంగళవారం రెండో అనధికారిక టెస్టు మొదలుకాగా.. మ్యాచ్ ఆరంభానికి ముందు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అంతేకాదు.. జట్టుకు కూడా దూరమయ్యాడు. ఈ విషయం గురించి విశ్వసనీయ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..
సెలక్టర్లకు సమాచారం
‘‘శ్రేయస్ విరామం తీసుకున్నాడు. అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా- ఎ జట్టుతో రెండో మ్యాచ్‌లో ఆడలేనని అయ్యర్ సెలక్టర్లకు సమాచారం ఇచ్చాడు. అయినప్పటికీ వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే జట్టులో మిడిలార్డర్ బ్యాటర్‌గా అతడు పోటీలోనే ఉంటాడు’’ అని పేర్కొన్నాయి.
కాగా వ్యక్తిగత కారణాల వల్లే శ్రేయస్ అనూహ్యంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న శ్రేయస్.. ఓవైపు వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎక్కడికి దారితీస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కెప్టెన్‌గా ధ్రువ్ జురెల్
ఇక శ్రేయస్ అయ్యర్ జట్టును వీడటంతో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో పాటు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. తెలుగు కుర్రాడు, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఆసీస్-‘ఎ’తో రెండో అనధికారిక టెస్టుకు భారత్-‘ఎ’ తుది జట్టు ఇదే
నారాయణ్ జగదీశన్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ (కెప్టెన్- వికెట్ కీపర్), ఆయుష్ బదోని, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్.