నేడు శ్రీలంకతో భారత మహిళల రెండో టి20
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ గెలుచు కొచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు శ్రీలంకతో మొదలైన టి20 సిరీస్‌లో శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే జోరుతో వరుస విజయాలతో ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది. తద్వారా సిరీస్‌లో పట్టు సాధించాలని చూస్తోంది. మరోవైపు లంక అమ్మాయిలు పటిష్టమైన భారత్‌కు ఎలాగైనా కళ్లెం వేయాలని, ఈ మ్యాచ్‌లో గెలిచి 1–1తో సమం చేయాలని పట్టుదలతో ఉన్నారు. గట్టి ప్రత్యరి్థని ఓడించేందుకు పకడ్బందీ ఎత్తుగడలను అమలు చేయాలని లంక జట్టు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ తీరంలోనే జరిగే ఈ రెండో టి20 ఆసక్తికరంగా జరిగే అవకాశముంది.
ఫీల్డింగ్‌తోనే సమస్య
హర్మన్‌ప్రీత్ బృందం మొదటి మ్యాచ్‌లో బాగానే ఆడింది. ప్రత్యరి్థని ఓడించింది. ఐదు టి20ల సిరీస్‌లో శుభారంభం చేసింది. అంతమాత్రాన భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ప్రత్యరి్థకంటే అగ్రగామిగా ఉందనుకుంటే పొరపాటు. బౌలింగ్, బ్యాటింగ్ బాగున్నప్పటికీ ఫీల్డింగ్ చాలా ఘోరంగా ఉంది. తొలి మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్‌తో విసుగు తెప్పించింది. సులువైన క్యాచుల్ని నేలపాలు చేసింది. అంతిమంగా విజయమే ముఖ్యమైనా... ఘోరమైన ఫీల్డింగ్‌ను అది మూసి పెట్టలేదు.
ఇదే విషయాన్ని కెపె్టన్ హర్మన్ సైతం అంగీకరించింది. తప్పకుండా ఫీల్డింగ్ లోపాలపై దృష్టి పెడతామని, నెట్స్‌లో క్యాచింగ్‌పైనే అతిగా ప్రాక్టీస్ చేశామని కూడా చెప్పింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన మెరుగ్గా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ విలువైన అర్ధసెంచరీతో అజేయంగా నిలిచింది. వీరితో పాటు షఫాలీ వర్మ కూడా రాణిస్తే పరుగులకు, భారీస్కోరుకు ఏమాత్రం ఇబ్బంది వుండదు. బౌలింగ్‌లో క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, శ్రీచరణి ఆకట్టుకున్నారు. కొత్తమ్మాయి వైష్ణవి శర్మ అరంగేట్రంలోనే అదరగొట్టింది. వికెట్ తీయలేకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.
సమం చేసే పనిలో...
సొంతగడ్డపై భారత్ పైచేయిగా ఉన్నప్పటికీ... ఆతిథ్య జట్టులోని లోపాలను సొమ్ము చేసుకొని సిరీస్ రేసులో నిలవాలని శ్రీలంక చూస్తోంది. భారత్ ఆధిక్యాన్ని ఇక్కడే సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ చమరి ఆటపట్టు, నీలాక్షికల వైఫల్యం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ 20 ఓవర్ల మ్యాచ్‌లో రెండు, మూడు ఓవర్లు చాలు మ్యాచ్‌గతినే మార్చడానికి. అందరు ఆడాల్సిన పనిలేదు. ఏ ఇద్దరు దంచేసినా చాలు ఆతిథ్య జట్టుకు గట్టి బదులు ఇవ్వొచ్చని శ్రీలంక ఆశిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, అమన్‌జోత్, అరుంధతి, క్రాంతి గౌడ్, వైష్ణవి, శ్రీచరణి.
శ్రీలంక: చమరి ఆటపట్టు (కెపె్టన్), విష్మీ గుణరత్నే, హాసిని, హర్షిత, కవీషా, ఇమేశ దులాని, నీలాక్షిక, కౌశిని, ఇనోక రణవీర, మాల్కి మదర, కావ్య, శషిని.


