దేశవాళీ మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తీపి కబురు అందించింది. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవాళీ స్థాయిలోనూ పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు వేతనాలు అందుకోనున్నారు. గతంతో పోలిస్తే మ్యాచ్ ఫీజులు దాదాపు 2.5 రెట్లు పెరిగాయి. సోమవారం (డిసెంబర్ 22) వర్చువల్‌గా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.
కొత్త ఫీజుల ప్రకారం.. సీనియర్ మహిళా క్రికెటర్లు వన్డే, బహుళ రోజుల టోర్నీలలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే ఇకపై రోజుకు రూ. 50 వేలు అందుకుంటారు. ప్రస్తుతం ఇది రూ. 20 వేలుగా ఉంది. అంటే దాదాపు రూ. 30 వేలు పెరిగింది. తుది జట్టులోని లేని సభ్యులకు ఒక్కో మ్యాచ్‌కు రూ. 25,000(ప్రస్తుతం రూ.12,500) లభించనుంది.
అదే విధంగా సీనియర్ క్రికెటర్లు టీ20ల్లో ఇకపై రోజుకు రూ.25 వేలు మ్యాచ్ ఫీజుల రూపంలో లభించనుంది. ప్రస్తుతం ఈ ఫీజు పది వేలుగా ఉంది. ఇక రిజర్వ్ ఆటగాళ్లకు రూ.12.500 లభిస్తాయి. గతంలో ఒక సీనియర్ మహిళా క్రికెటర్ అన్ని ఫార్మాట్లలో కలిపి లీగ్ మ్యాచ్‌లు ఆడితే దాదాపు రూ.3 లక్షలకు వరకు సంపాదించేవారు. ఇప్పుడు ఆ మెత్తం గణనీయంగా పెరగనుంది.
జూనియర్లకు బంపరాఫర్..
జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ల జీతాలు కూడా బీసీసీఐ పెంచింది. జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ల(వన్డే, మల్టీ డేస్)లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న ఆటగాళ్లకు ఒక రోజు ఆడితే రూ. 25,000 అందుకోనున్నారు. ప్రస్తుతం ఇది పది వేలుగా ఉంది. రిజర్వ్ ఆటగాళ్లకు రూ. 12,500 లభిస్తాయి. అదేవిధంగా టీ20 మ్యాచ్‌లలో ఆడే ఆటగాళ్లకు రూ. 12,500, రిజర్వ్ ఆటగాళ్లు రూ. 6250 అందనుంది.
కేవలం ఆటగాళ్లకే కాకుండా అంపైర్లు, మ్యాచ్ రెఫరీల ఫీజులను కూడా బీసీసీఐ పెంచింది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. లీగ్ మ్యాచ్‌ల కోసం రోజుకు రూ.40,000, నాకౌట్ మ్యాచ్‌ల కోసం రోజుకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు అందుకోనున్నారు.
చదవండి: IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!


