భారత క్రికెట్ పరిపాలనలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇందర్జిత్ సింగ్ బింద్రా (ఐఎస్ బింద్రా) వయోభారంతో (84 ఏళ్లు) ఆదివారం కన్నుమూశారు. బింద్రా 1993 నుండి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 1978 నుండి 2014 వరకు 36 సంవత్సరాల పాటు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
బింద్రా మరణం భారత క్రికెట్ చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికింది. పరిపాలకుడిగా తన దూరదృష్టి, సాహసోపేతమైన నిర్ణయాలతో బింద్రా భారత క్రికెట్‌ను ప్రపంచ వేదికపై తిరుగులేని శక్తిగా నిలిపారు.
1987 వరల్డ్‌కప్‌ను భారత ఉపఖండానికి తీసుకురావడంలో బింద్రా కీలక పాత్ర పోషించారు. ఇది మొదటిసారి ఇంగ్లండ్ వెలుపల జరిగిన వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించిన బింద్రా.. భారత క్రికెట్ ఆర్థికస్థితిగతుల రూపురేఖల్ని మార్చారు.
అనంతరం బింద్రా ప్రోద్భలంతోనే 1996 వరల్డ్‌కప్ కూడా భారత ఉపఖండంలో జరిగింది. ఈ ప్రపంచకప్ నిర్వహణ ప్రపంచ క్రికెట్‌లో భారత్ కేంద్రస్థానంగా మారడానికి దోహదపడింది.
ప్రపంచకప్ లాంటి ఐసీసీ మెగా టోర్నీలను భారత్‌కు తీసుకురావడంలో సఫలీకృతుడైన బింద్రా.. ప్రసార హక్కుల విషయంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు. 1994లో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించి, దూరదర్శన్ ఏకాధికారాన్ని సవాలు చేశారు. ఆ తీర్పుతో ప్రైవేట్ మరియు అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత క్రికెట్‌లోకి ప్రవేశించాయి.
ESPN, TWI వంటి సంస్థలు మార్కెట్లోకి రావడంతో టెలివిజన్ ద్వారా క్రికెట్ భారత దేశ నలుమూలకు చేరింది. దీంతో ఆదాయాలు పెరిగి, భారత క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ మార్కెట్‌గా మారింది. ఈ ఆర్థిక బలమే బీసీసీఐని స్వతంత్రంగా, శక్తివంతంగా నిలబెట్టింది.


