టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అతడి పట్ల ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గుర్రుగా ఉంది. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేని సమయంలో దేశీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇందుకు అనుగుణంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) సైతం ఈసారి వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగారు. కోహ్లి ఢిల్లీ తరఫున.. రోహిత్ ముంబైకి ఆడి సత్తా చాటారు. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం సొంతజట్టు ముంబై తరఫున ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు.
రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు
ప్రస్తుతం ముంబై జట్టు రంజీ ట్రోఫీ రెండో దశ (Ranji Trophy 2025-26) మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాకౌట్ దశకు అర్హత సాధించింది. తదుపరి సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో ముంబై తలపడనుంది.
కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సహా వెటరన్ స్టార్ అజింక్య రహానే వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంసీఏ సెలక్టర్లు.. ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయమై యశస్వి జైస్వాల్‌ను సంప్రదించారు. అయితే, అతడి నుంచి ఎలాంటి స్పందనా లేదని తెలుస్తోంది. దీంతో జైసూను ఎంపిక చేయబోమని ఎంసీఏ వర్గాలు స్పష్టం చేశాయి.
స్పందన కరువు..
ఈ విషయం గురించి MCA అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. “హైదరాబాద్‌తో మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలోనూ అతడిని సంప్రదించాము. అయితే, అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. తనకు నచ్చినపుడు నచ్చిన మ్యాచ్‌లలో మాత్రమే అతడు ఆడాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.
యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము!
తదుపరి మ్యాచ్ కోసం అందుబాటులో ఉంటాడా? లేదా? అని అడిగినపుడు కూడా అతడి నుంచి స్పందన లేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్‌కు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. అతడిని ఎంపిక చేయడం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీతో మ్యాచ్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంసీఏ ఆదివారం ప్రకటించింది. సిద్దేశ్ లాడ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి స్టార్లు ఉన్నారు.


