న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్ వర్మకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌కు మరో లక్కీ ఛాన్స్ దక్కింది. తిలక్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ను చివరి రెండు టీ20లకు కూడా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారు. ప్రపంచకప్‌కు ముందు శ్రేయస్ తనను తాను నిరూపించుకునేందుకు ఇది సువర్ణావకాశం. శ్రేయస్ భారత్ తరఫున టీ20లు ఆడక చాలా కాలమైంది.
న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు అతను ఎంపికైనా, తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో చేజిక్కించుకోవడంతో శ్రేయస్‌కు చివరి రెండు టీ20ల్లో అవకాశం దక్కవచ్చు. ఈ అవకాశాన్ని శ్రేయస్ సద్వినియోగం చేసుకోగలిగితే, ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.
ప్రపంచకప్‌కు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం గాయంతో బాధపడుతూ న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఒకవేళ సుందర్ ప్రపంచకప్‌కు దూరమైతే అతని స్థానాన్ని శ్రేయస్‌తో భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇది అంత సులువుగా జరిగే విషయం అయితే కాదు. ఎందుకంటే, సుందర్ స్థానానికి ఇప్పటికే గట్టి పోటీ ఉంది.
సుందర్‌కు ప్రత్యామ్నాయంగా న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన రవి బిష్ణోయ్ ప్రధాన పోటీదారుగా మారాడు. బిష్ణోయ్ చాలాకాలం తర్వాత లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మూడో టీ20లో సత్తా చాటాడు. ప్రపంచకప్ భారత ఉపఖండంలో జరుగుతుంది కాబట్టి, సెలెక్టర్లు సుందర్ లాంటి ఆల్‌రౌండర్ కాకపోయినా, బిష్ణోయ్ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌తో అడ్జస్ట్ కావచ్చు.
సుందర్ స్థానానికి మరో ప్రధాన పోటీదారుడు రియాన్ పరాగ్. పరాగ్ సుందర్ లాగే స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాబట్టి, సెలెక్టర్లు అతనివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పరాగ్ సైతం చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్నా, ఐపీఎల్ 2025 సత్తా చాటడం అతనికి కలిసొచ్చే అంశం.
ఈ లెక్కన వాషింగ్టన్ సుందర్ ప్రపంచకప్‌కు దూరమైతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్ రేసులో ఉంటారు. వీరిలో బిష్ణోయ్ ఇదివరకే (మూడో టీ20) తనను నిరూపించుకున్నాడు. శ్రేయస్‌కు ఒకవేళ చివరి రెండు టీ20ల్లో అవకాశం వచ్చి, అతను కూడా సత్తా చాటితే, సుందర్ స్థానానికి ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, శ్రేయస్ చివరి రెండు టీ20లకు కొనసాగనుండటంతో, న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ వర్మ అందుబాటులో ఉండడనే విషయం స్పష్టమవుతుంది. విజయ్ హజారే ట్రోఫీలో గాయపడిన తిలక్‌ను న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపిక చేయలేదు. అతను చివరి రెండు టీ20లకు అందుబాటులో వస్తాడని సెలెక్టర్లు ఆశించారు.
అయితే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రేయస్ చివరి రెండు మ్యాచ్‌లకు కూడా కొనసాగనున్నాడు. తిలక్ న్యూజిలాండ్ సిరీస్ మొత్తానికి దూరమైనా ప్రపంచకప్‌కు అందుబాటులోకి వస్తాడని కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా జనవరి 28, 31 తేదీల్లో జరుగనున్నాయి.


