టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఐసీసీ ఈవెంట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా మెగా టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
3-0తో కైవసం
ఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. అయితే, ఈ సిరీస్ ఆరంభానికి ముందు నుంచే టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ తొలి మూడు టీ20లకు దూరం కాగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
తిలక్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).. వాషింగ్టన్ స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయి (Ravi Bishnoi) జట్టులోకి వచ్చారు. ఇక తిలక్ వేగంగా కోలుకుంటుండగా.. వాషీ మాత్రం ఇప్పట్లో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..

ఇంకో రెండు వారాలు
‘‘అతడు పూర్తిగా ఫిట్‌గా మారడానికి ఇంకో రెండు వారాల సమయం పట్టొచ్చు. టీ20 ప్రపంచకప్ జట్టుతో అతడిని కొనసాగించాలా? లేదంటే మరో ఆటగాడితో వాషీ స్థానం భర్తీ చేయాలా? అన్న విషయం గురించి సీనియర్ సెలక్షన్ కమిటీ, జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది’’ అని పేర్కొన్నాయి.
కాగా ఒకవేళ వాషీ గనుక వరల్డ్‌కప్ టోర్నీకి దూరమైతే భారత తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. పవర్‌ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు లెఫ్టాండర్లకు బ్యాటింగ్ చేయడంలో అతడు సేవలు అందించగలడు.
అక్షర్ సైతం
అయితే, స్పిన్ విభాగంలో ఇప్పటికే మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లతో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు. కాకపోతే అక్షర్ సైతం గాయం వల్ల కివీస్‌తో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో వాషీ సైతం దూరమైతే పరిస్థితి గందరగోళంగా మారుతుంది.
ఇక కివీస్‌తో సిరీస్‌లో ఆడుతున్న రవి బిష్ణోయి.. వాషీ స్థానంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి కూడా వచ్చే అవకాశం ఉంది. కాగా న్యూజిలాండ్‌తో మూడో టీ20తో తుదిజట్టులోకి వచ్చిన బిష్ణోయి.. రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.


