గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని, ఓవరాల్‌గా ఏడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ పేరిట ఉంది. దీపేంద్ర 2023 ఏషియన్ గేమ్స్‌లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. సంజూ శాంసన్ (0), ఇషాన్ కిషన్ (28) ఔట్ కాగా.. అభిషేక్ శర్మ (67), సూర్యకుమార్ యాదవ్ (42) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 66 బంతుల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేయాలి.
అంతకుముందు బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-17-3), హార్దిక్ పాండ్యా (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. చాప్‌మన్ (32), సాంట్నర్ (27), డారిల్ మిచెల్ (14), సీఫర్ట్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్ (4), జేమీసన్ (3), హెన్రీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.


