గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 153 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు.
ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం బుమ్రా మహోగ్రరూపం దాల్చాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీటిలో టిమ్ సీఫర్ట్, కైల్ జేమీసన్ వికెట్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్లీన్ బౌల్డ్ అంటే ఏదో సాదాసీదా కాదు. బుమ్రా బౌలింగ్ వేగానికి వికెట్లు గాల్లో నాట్యం చేశాయి. మరో బౌలర్ రవి బిష్ణోయ్ కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, బిష్ణోయ్.. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాంగా వచ్చి చెలరేగడం విశేషం.
న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో మరో ఇద్దరు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషించారు. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి కీలకమైన డెవాన్ కాన్వే వికెట్ తీయగా.. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
మిగతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3-0-32-0), శివమ్ దూబే (2-0-24-0) వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. చాప్‌మన్ (32), సాంట్నర్ (27), డారిల్ మిచెల్ (14), సీఫర్ట్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్ (4), జేమీసన్ (3), హెన్రీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.


