విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. తొలుత బౌలర్లు.. ఆతర్వాత బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయాన్నందించారు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ ఇలా అన్నాడు. అతని మాటల్లో.. టాస్ గెలుపు చాలా కీలకం. టాస్ తప్ప ఈ మ్యాచ్ గెలుపులో నా పాత్ర ఏమీ లేదు. ఈ సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం టాస్ గెలిచినప్పుడే.
తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడటం వల్ల సెకెండ్ ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేయవల్సి వచ్చింది. మంచు కురిసే వేళల్లో అది బౌలర్లకు విషమ పరీక్ష. ఈ రోజు టాస్ గెలిచి బౌలర్లను ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాను.
పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. అయినా మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి వికెట్లు సాధించారు. ప్రసిద్ద్ తొలుత ఇబ్బంది పడినా, ఆతర్వాతి స్పెల్‌లో మ్యాచ్ గతినే మార్చేశాడు. ఆతర్వాత కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
వారి తరఫున డికాక్ అద్భుతంగా ఆడాడు. అతడి వికెట్ చాలా కీలకం. సిరీస్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేశాం. సిరీస్ ఆధ్యాంతం సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. మా బౌలర్లపై అధికమైన ఒత్తిడి ఉండింది. రెండో వన్డేలో అదృష్టం మా పక్షాన లేదు. అందుకే ఓడాం.
కాగా, నిన్నటి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (9.5-0-66-4), కుల్దీప్ యాదవ్ (10-1-41-4) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 270 పరుగులకే పరిమితం చేశారు. డికాక్ (106) ఒక్కడే సెంచరీతో పోరాటం చేశాడు. బవుమా (48) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీతో.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


