ఐపీఎల్ క్రికెటర్, కర్ణాటక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు ఇవాళ (డిసెంబర్ 22) రిటైర్మెంట్ ప్రకటించాడు. రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ కమ్ బ్యాటర్ అయిన 37 ఏళ్ల గౌతమ్ 2021లో టీమిండియా తరఫున ఒకే ఒక వన్డే ఆడాడు. అప్పటి నుంచి మరో అవకాశం రాని గౌతమ్.. దేశవాలీ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమయ్యాడు.
గౌతమ్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. కర్ణాటక తరఫున అతను 32 మ్యాచ్‌లు ఆడి 116 వికెట్లు తీశాడు. అలాగే ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ గౌతమ్ ఓ మోస్తరు రికార్డు కలిగి ఉన్నాడు. 32 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీసి, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో 49 మ్యాచ్‌లు ఆడిన గౌతమ్ 32 వికెట్లు తీయడంతో పాటు 2 హాఫ్ సెంచరీల సాయంతో 454 పరుగులు సాధించాడు.
గౌతమ్‌కు ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన అవకాశం దక్కింది. 2017లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన గౌతమ్‌ను 2021 సీజన్‌లో సీఎస్‌కే ఏకంగా రూ. 9.25 కోట్ల ధర వెచ్చించి సొంతం చేసుకుంది. అప్పట్లో ఓ అన్ క్యాప్డ్ ప్లేయర్‌కు దక్కిన అతి భారీ మొత్తం ఇదే. ఐపీఎల్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్, సీఎస్‌కేతో పాటు రాజస్థాన్ రాయల్స్ (2018), లక్నో సూపర్ జెయింట్స్‌కు (2022-24) ఆడిన గౌతమ్.. మొత్తంగా 36 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీశాడు.


