ట్రోఫీతో కోహ్లి- పక్కన మాజీ ఆటాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ (PC: BCCI)
ఐపీఎల్-2026 వేలం (IPL 2026 Auction) నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకోవాల్సిన, వదిలివేయాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. నవంబరు 15 నాటికి లిస్టును ఖరారు చేయాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంఛైజీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ తమ జట్టును కొనసాగించాలని సూచించాడు. అంతగా అవసరం అయితే.. ఓ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే విడిచిపెట్టాలని అభిప్రాయపడ్డాడు.
కాగా పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్‌గా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో విజయోత్సవం సందర్భంగా తొక్కిసిలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.
అమ్మకానికి ఆర్సీబీ
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది. డియాజియో తాము ఆర్సీబీని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో జట్టుకు కొత్త యజమానులు రావడం ఖాయం కాగా.. రిటెన్షన్ లిస్టుపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ ఆరంభం నుంచి.. అంటే 2008 నుంచి భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఒక్కడే జట్టుతో ఉన్న విషయం తెలిసిందే.
ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ ఈసారి ఇద్దరిని మాత్రమే విడుదల చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం జట్టు కూర్పు బాగుంది. అలాంటపుడు మార్పులు చేయడం సరికాదనే చెప్పాలి.
లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దర్ సలామ్‌లను విడుదల చేసినా పెద్దగా నష్టం లేదు. అంతకు మించి మార్పులు వద్దు. మిగిలిన అందరినీ అట్టిపెట్టుకోవాలి. నిజానికి లివింగ్‌స్టోన్ ఖరీదైన ఆటగాడు. ఈ సీజన్‌లో అంత గొప్పగా కూడా ఆడలేదు.
రజత్ పాటిదార్, విరాట్ కోహ్లి తర్వాత జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ వస్తారు. కాబట్టి మిడిలార్డర్‌లో లివింగ్‌స్టోన్‌ను తీసేసి.. ఇంకా మెరుగ్గా ఆడగలిగే బ్యాటర్‌ను కొనుగోలు చేస్తే సరిపోతుంది.
అతడికి అంత మొత్తం ఎక్కువే
పేస్ విభాగంలో యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, రొమారియో షెఫర్డ్, నువాన్ తుషార ఉన్నారు. వీరికి తోడుగా భారత ఫాస్ట్ బౌలర్‌ను తెచ్చుకుంటే సరి. రసిఖ్‌కు అంత మొత్తం ఎక్కువే. కాబట్టి అతడిని వదిలేసి మరొకరిని తీసుకుంటే మరో ప్లేయర్ కోసం డబ్బు కూడా మిగులుతుంది’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా లివింగ్‌స్టోన్‌ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ.. రసిఖ్ కోసం ఏకంగా రూ. 6 కోట్లు వెచ్చించింది. లివింగ్‌స్టోన్ ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 112 పరుగులు చేయగా.. రసిఖ్ రెండు మ్యాచ్‌లలో కలిపి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు.


