
స్ఫూర్తి
స్ఫూర్తిదాయకమైన విజేతలు, సామాన్యులలో అసామాన్యుల గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్‌లు పెట్టే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి పారాలింపిక్ అథ్లెట్ శీతల్‌దేవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో శీతల్‌దేవి చారిత్రాత్మకమైన బంగారు పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే.
పుట్టుకతోనే రెండు చేతులు లేక పోయినా సంకల్పబలాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు శీతల్. ఆ బలమే తనను స్ఫూర్తిదాయకమైన విజేతను చేసింది. ‘శీతల్, నువ్వెప్పుడూ వరల్డ్ ఛాంపియన్‌వే. ప్రజల మనసులను గెలుచుకోవడంలో కూడా నువ్వు ఛాంపియన్‌వి’ అని శీతల్‌దేవిని ఆకాశానికెత్తారు మహీంద్రా. గత సంవత్సరం ఒక బాణాన్ని ఆనంద్‌కు బహూకరించింది శీతల్. ‘నువ్వు నాకు బహుమతిగా ఇచ్చిన బాణం నా కుటుంబంలో విలువైన వారసత్వ సంపదగా నిలిచి పోతుంది. నీలాగే ధైర్యంగా ఉండడానికి మాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది’ అని రాశారు. శీతల్‌దేవితో తాను ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.