
ఉదయం బ్రష్ చేయడం మొదలు రాత్రి వరకు ఒక్కొక్కరు ఎంతో నీటిని వృథా చేస్తున్నాం.. అవసరం ఉన్నంత వరకు మాత్రమే భోజనం చేసే మనం.. నీటి పొదుపునకు మాత్రం ఏ మాత్రం విలువనివ్వడం లేదు. నిత్యం లక్షల లీటర్ల నీటిని డ్రైనేజీలో కలిపేస్తున్నాం. సింగపూర్ దేశం పేరు చెబితే వావ్.. అనే మనం అక్కడి తాగునీటి పరిస్థితి గురించి తెలిస్తే మాత్రం వామ్మో.. అనాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 6వ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడి పరిస్థితులను వివరిస్తుంటే.. ఆలోచనలో పడాల్సిందే..
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్)కు చెందిన 43 మంది విద్యార్థులు ఇటీవల సింగపూర్‌లో పర్యటించి వచ్చారు. ఆ బృందంలో ఆరో తరగతి చదువుతున్న అనమల నేహాశ్రిత కూడా ఉన్నారు. ఆ పర్యటన తనకు తాగునీటి విలువ తెలిసేలా చేసిందని, ఇకపై నీరు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నానని చెబుతోంది. ఈ సందర్భంగా చిన్నారి నేహా బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఇలా..
‘నాలుగు రోజుల పర్యటనలో యూనివర్సల్ స్టూడియో, మెర్లైన్ పార్క్ సహా అనేక ప్రాంతాలు తిరిగాం. అన్నింటికంటే మరీనా బరాజ్ ఎన్నో విషయాలు నేర్పింది. సింగపూర్‌లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నదులు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు చాలా తక్కువ. ఈ బరేజ్‌లో వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు సముద్ర జలాలను తాగునీరుగా మారుస్తున్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి సింగపూర్ ప్రభుత్వం మలేషియా నుంచి కొనుగోలు చేస్తోంది. సీవేజ్, వేస్ట్ వాటర్‌ను రీసైకిల్ చేసి వాడుకుంటోంది.
ఈ నీరు తాగడం ఇష్టం లేక బాటిల్ కొనుక్కోవాలంటే 2.8 సింగపూర్ డాలర్లు(రూ.193) వెచి్చంచాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, నీటి భద్రతను జాతీయ భద్రతగా భావిస్తున్న ఆ ప్రభుత్వం.. ఇలా అన్నీ చూసిన తర్వాత తాగునీటి విలువ ఏంటో తెలిసింది. మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలుష్య, నీటి వృథా ఉండకూడదని తెలుసుకున్నా.
ఇవి పాటించడంతో పాటు నాకు తెలిసిన వారికీ వివరిస్తూ పాటించాలని సూచిస్తా. దీనికోసం ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) తయారు చేస్తున్నా. నాలో మార్పు తీసుకువచ్చిన ఈ సింగపూర్ పర్యటనకు అవకాశం ఇచ్చిన స్కూల్, మాతో వచ్చి కొత్త విషయాలు నేర్పించిన టీచర్స్‌కు ధన్యవాదాలు’.