ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గ్లోబల్‌ ఐకాన్‌ రామ్‌ చరణ్‌ | Global Icon Ram Charan to Champion Inaugural Archery Premier League as Brand Ambassador | Sakshi
Sakshi News home page

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గ్లోబల్‌ ఐకాన్‌ రామ్‌ చరణ్‌

Sep 18 2025 9:29 PM | Updated on Sep 18 2025 9:33 PM

Global Icon Ram Charan to Champion Inaugural Archery Premier League as Brand Ambassador

భారత్‌లో తొలిసారి జరుగనున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌)కు గ్లోబల్‌ ఐకాన్‌ రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యారు. ఈ విషయాన్ని జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌(ఏఏఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ఏపీఎల్‌ అరంగేట్రం ఎడిషన్‌ న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా అక్టోబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు జరుగనుంది.

ఈ లీగ్‌లో ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చర్లతో పాటు  వివిధ దేశాల ఆర్చర్లు పోటీ పడనున్నారు. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్‌ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో ఈ లీగ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉంటాయి. ఇందులో 36 మంది  భారత టాప్‌ ఆర్చర్లతో పాటు 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీ పడనున్నారు. ఈ లీగ్‌ ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్‌ ఫార్మాట్‌ ద్వారా ఆర్చర్లు రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీ పడతారు.

ఏపీఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడైన సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ఆర్చరీ అనే క్రీడ క్రమశిక్షణ, ఫోకస్‌, స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఈ  కారణంగానే ఏపీఎల్‌తో బంధం ఏర్పరచుకున్నాను. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. ఈ లీగ్‌ భారత ఆర్చర్లకు గ్లోబల్‌ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.

జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు అర్జున్‌ ముండా మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ఆర్చర్లకు ప్రతిభ నిరూపించుకునేందుకు ఏపీఎల్‌ వేదికగా ఉపయోగపడనుంది. ఈ లీగ్‌ వారి భవిష్యత్‌ లక్ష్యాలను ఆవిష్కరించేందుకు తోడ్పడుతుందన్న గట్టి నమ్మకం మాకుంది. ఆర్చరీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ లీగ్‌ దోహదపడుతుంది. రామ్‌చరణ్‌ లాంటి స్టార్‌ హీరో బ్రాండ్‌ అంబాసీడర్‌గా ఉండటం వల్ల దేశంలోని చాలా మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితులయ్యే ఆస్కారం ఉంటుందని అన్నారు.

ఏఏఐ ప్రధాన కార్యదర్శి  వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. దేశంలోని మిగతా లీగ్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్చరీ లీగ్‌ను ఏర్పాటు చేశాం. ఏపీఎల్‌ను ప్రొఫెషనల్‌ స్థాయికి తగ్గట్లుగా  నిర్వహిస్తాం. ఇది కేవలం లీగ్‌ మాత్రమే కాదు, భారత ఒలింపిక్‌ స్వప్నాన్ని సాకారం చేసే మెట్టుగా మారనుంది. రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఉండటం ద్వారా ఈ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement