
హమాస్ చెర నుంచి ఎట్టకేలకు బందీల విడుదల
రెండేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన హమాస్–ఇజ్రాయెల్ యుద్ధ బాధితులు
ప్రతిగా వేలాది మంది ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్‌లో మిన్నంటిన ఆనందోత్సాహాలు
డెయిర్ అల్ బాలాహ్(గాజా స్ట్రిప్)/జెరూసలేం: నెలల తరబడి చీకట్లో మగ్గిపోయిన ఇజ్రాయెలీ బందీలు ఎట్టకేలకు హమాస్ బందీ సంకెళ్లను తెంపుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన హమాస్, ఇజ్రాయెల్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక శుక్రవారం అమల్లోకిరాగా బందీల విడుదల సోమవారం మొదలైంది. రెండేళ్లకుపైగా తమ వద్ద బందీలుగా ఉంచుకున్న 20 మంది ఇజ్రాయెలీలను హమాస్ పాలస్తీనాలోని వేర్వేరు చోట్ల ఏకకాలంలో విడిచిపెట్టింది. దీంతో ఇజ్రాయెలీ బందీల కుటుంబాల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
బందీలు విడుదలయ్యారన్న వార్త తెలీగానే ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్ ప్రధాన కూడళ్ల వద్ద వేలాది మంది జనం పోగయ్యి సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులు బందీల కోసం ఎదురుచూశారు. చిక్కిశల్యమైన తమ వారిని చూసిన ఆనందంలో బందీల కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు. వాళ్లను హత్తుకుని ఆనందభాష్పాలను రాల్చారు. ‘‘ మా నాన్న ఓమ్రీ మిరాన్ ఏకంగా 738 రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఆయన రాక కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. వేదన అంతా ఇప్పుడు మటుమాయమైంది’’ అని ఓమ్రీ సంతానం ఆనందం వ్యక్తంచేసింది.
ఓమ్రీని వీడియోకాల్‌లో తొలిసారిగా చూసిన ఆయన భార్య లేషే మిరాన్ లావీకు ఆనందంతో మాటలు రాలేదు. నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన పలువురు బందీల పార్థివదేహాలను సైతం హమాస్ రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది. మరికొన్ని మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో తమకు సైతం స్పష్టంగా తెలీదని హమాస్ ప్రతినిధులు చేసిన ప్రకటనపై బందీలు, ఆచూకీగల్లంతైన బాధితుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ కచ్చితంగా కట్టుబడి ఉండాలని డిమాండ్‌చేసింది. ఇజ్రాయెల్ సైతం ఒప్పందంలో భాగంగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఓపెర్ జైలు నుంచి దాదాపు 2,000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టింది. వీళ్లలో గతంలో జీవితఖైదు పడిన 250 మంది ఖైదీలు న్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో అదుపు లోకి తీసుకున్న వందలాది మందిని ఇజ్రాయెల్ విడుదలచేసింది. దీంతో వీళ్లంతా గాజా, వెస్ట్ బ్యాంక్‌లకు బయల్దేరారు. బస్సులో చేరుకున్న తమ వారిని చూసిన ఆనందంలో రమల్లా సిటీలోని పాలస్తీనియన్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
పీడకల పోగొట్టాం.. శాంతిస్థాపన బాధ్యత మీదే: ట్రంప్
బందీల విడుదలతో కీలకపాత్రపోషించిన ట్రంప్ సోమవారం పశ్చిమాసియా పర్యటనలో భాగంగా తొలుత ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో ప్రసంగించారు. 2008 తర్వాత అమెరికా అధ్యక్షుడు నెస్సెట్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. 1949 ఏడాది నుంచి చూస్తే గతంలో కేవలం ముగ్గురు అమెరికా అధ్యక్షులు మాత్రమే కేనేసెట్‌కు వచ్చారు. స్పీకర్ ఆమిర్ ఒహామా ఘన స్వాగతం తర్వాత పార్లమెంటేరియన్లనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘ నెలలతరబడి పట్టి పీడించిన బాధాతప్త యుద్ధ పీడ కలను మేం పోగొట్టాం. తుపాకులు ఇప్పుడు మౌనం దాల్చాయి.
ఇక మీరు రణక్షేత్రంలో సాధించడానికి ఏమీ లేదు. ఇక ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సువర్ణావకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. శాంతిని శాశ్వత చేయండి. పశ్చిమాసియాలో కొత్త శాంతి ఉషోదయం మొదలైంది. మధ్యవర్తిత్వం వహించిన నా అల్లుడు జేడ్ కుష్నర్, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, అరబ్ దేశాలకు కృతజ్ఞతలు. ఇజ్రాయెల్‌కు మాత్రమేకాదు పశ్చిమాసియాలో సువర్ణా« ద్యాయం మొదలుకానుంది. గాజాలో నిస్సైనికీ కరణ జరగాలి. హమాస్ ఆయుధాలను త్యజించాలి. దానికి ఇంకా అంగీకారం కుదరలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రసంగాన్ని ఒకరు అడ్డుకోబోగా భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాక్కెళ్లారు.
ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం
గాజా ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు ట్రంప్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవంతో సత్కరించనుంది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ట్రంప్‌కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ సోమవారం ప్రకటించారు. త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్‌ను ఈ పురస్కారంతో సత్కరిస్తామని ఇస్సాక్ చెప్పారు.