హకీంపూర్: భారత్–బంగ్లాదేశ్ మధ్య పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా హకీంపూర్ వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్ బోర్డర్ పోస్టు ఇప్పుడు రద్దీగా మారిపోయింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు నకిలీ పత్రాలతో ఏళ్లుగా హాయిగా గడిపారు. స్థానిక అధికారులు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) చేపట్టడంతో అనధికారికంగా హకీంపూర్ పోస్టు మీదుగా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
సంచుల్లో లగేజీలతో, చిన్నారుల చేతుల్లో వాటర్ బాటిళ్లతో కుటుంబాలకు కుటుంబాలు బంగ్లా బాట పడుతున్నాయి. మమ్మల్ని మాయింటికి వెళ్లనివ్వండి అంటూ వారు జవాన్లను వేడుకుంటున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోందని భద్రతా సిబ్బందితోపాటు స్థానికులు కూడా అంటున్నారు. ఎస్‌ఐఆర్ వల్లే అసాధారణస్థాయిలో వ్యతిరేక వలసలు మొదలయ్యాయంటున్నారు.
వీళ్లలో చాలా మంది దళారుల సాయంతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు సంపాదించుకుని ఇక్కడే తిష్ట వేశారు. అయితే, ఎస్‌ఐఆర్ సిబ్బంది పాత ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలిచ్చి రిస్కు తీసుకోవడం, జైలుకు వెళ్లడం కంటే సొంతదేశం తిరిగివెళ్లి కొంతకాలం అక్కడే ఉండటమే ఉత్తమమని వీరంతా భావిస్తున్నారు.
హౌరా పారిశ్రామిక ప్రాంతంలోని ధులగోరి, బిరాటి, న్యూ టౌన్, ఘుసురి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే బంగ్లా దేశీయులు బోర్డర్ పాయింట్ వద్ద క్యూలు కడుతున్నారు. రోజుకు కనీసం 200 మందిని సరైన పత్రాలు లేవనే కారణంతో వెనక్కి పంపించి, నిర్బంధంలోకి తీసుకుంటున్నామని బీఎస్‌ఎఫ్ జవాన్లు తెలిపారు. ఇలాంటిది తామసలు ఊహించలేదంటున్నారు.
‘వెనక్కి వెళ్లేవారు చూపే పత్రాలను పరిశీలించడం తప్పనిసరి. వాటిని జిల్లా అధికారులతోపాటు రాష్ట్ర పోలీసులకు పంపించాల్సి ఉంటుంది. అందుకు రెండు మూడు రోజుల సమయం తీసుకుంటోంది. దీంతో వారంతా అక్కడే మకాం వేస్తున్నారు’అని ఓ అధికారి చెప్పారు. వారికి ఆహారం అందజేస్తున్నామన్నారు. అయితే, బంగ్లాదేశీయుల రివర్స్ మైగ్రేషన్‌తో బెంగాల్ పోలీసులు సతమతమవుతున్నారు. సరైన పత్రాలు లేవనే కారణంతో నిర్బంధించిన వారిని జైళ్లలో పెట్టేందుకు సరైన వసతులు లేవు. అందుకే వారిని వదిలేస్తున్నామంటున్నారు.


