సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ఎన్నికల సంఘం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 2019 నాటి ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్బంగా మున్సిపల్ ఎన్నికల కోసం 2019 నాటి ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అలాగే, ఈనెల 16వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా ప్రచురించాలి. టీపోల్ యాప్‌లో పోలింగ్ స్టేషన్ల వివరాలు అప్‌లోడ్ చేయాలని తెలిపింది.
ఇక, పోలింగ్ స్టేషన్లలో బీఎల్‌వోల ద్వారా ఓటరు వివరాలను పరిశీలన చేయాలని సూచించింది. అలాగే, ఆన్‌లైన్‌లో కూడా ఓటరు నమోదు, మార్పులకు అవకాశం ఇచ్చింది. FST, SST బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
12-01-2026 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ
13-01-2026న క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన ప్రారంభం
16-01-2026న తుది ఓటరు జాబితా విడుదల చేయాలని ఆదేశం.


