12 రాష్ట్రాలు, యూటీల్లో ముగిసిన రెండో దశ ఎస్‌ఐఆర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల నుంచి 6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. మృతి చెందడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ కేటగిరీ వంటి కారణాలతో ఆయా ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది.
రాష్ట్రాలవారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం తాజాగా ప్రచురించింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా మొత్తం 50.90 కోట్ల ఓటర్ల అర్హతలను తనిఖీ చేశారు. అనర్హుల పేర్లను తొలగించిన తర్వాత 44.40 కోట్ల మంది ఓటర్ల పేర్లతో ముసాయిదా జాబితాలు సిద్ధం చేశారు. తొలగింపునకు గురైనవారి పేర్లను ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్/డూప్లికేట్(ఎస్‌ఏడీ) విభాగంలో చేర్చినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం గమనార్హం.


