అక్రమ ఆయుధాల ముఠా గుట్టురట్టు
ఢిల్లీలో నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: సరిహద్దు వెంట భూమార్గంలో నిఘా కట్టుదిట్టంగా ఉండటంతో గగనతలంలో డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ఆయుధాలను తరలిస్తున్న భారీ ముఠా గుట్టు రట్టయింది. చైనా తయారీ అత్యాధునిక ఆయుధాలను డ్రోన్లతో భారతగడ్డ మీదకు తీసుకొస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను శనివారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ సభ్యులకు పాకిస్తాన్‌లోని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)తో సంబంధాలున్న ఆయుధ సరఫరాదారులతో సంబంధాలున్నట్లు సమాచారం.
తుర్కియేలో తయారైన పీఎక్స్ 5.7 మోడల్ పిస్టళ్లు, చైనా తయారీ పీఎక్స్3 పిస్టళ్లు ఐదు సహా 10 అత్యాధునిక పిస్టల్స్, 92 బుల్లెట్లను తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీఎక్స్ పిస్టల్‌లను సాధారణంగా ప్రత్యేక దళాలు మాత్రమే వినియోగిస్తాయి. పంజాబ్‌కు చెందిన మణ్‌దీప్ సింగ్, దల్వీందర్, యూపీలోని బాఘ్‌పత్‌కు చెందిన రోహన్ తోమర్, అజయ్ అలియాస్ మోనులనూ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న, అమెరికాకు పారిపోయిన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ సోనూ ఖత్రి అలియాస్ రాజేశ్ కోసం భారత్‌కు ఆయుధాలు తెప్పిస్తున్నారని నవంబర్ 19న పోలీసులకు సమాచారం అందింది.
దీంతో రోహిణి పట్టణంలోని ఖాతూ శ్యామ్ ఆలయం వద్ద చాకచక్యంగా ముఠాసభ్యులను పోలీసులు అరెస్ట్‌చేసి వాళ్ల నుంచి పిస్టళ్లు, బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నారు. ఫిలౌర్‌కు చెందిన మణ్‌దీప్, లూథియానాకు చెందిన దలీ్వందర్ చిన్ననాటి స్నేహితులు. గ్యాంగ్‌స్టర్ ఖత్రి సహాయకుడు జ్రస్పీత్‌తో వీళ్లకు సంబంధం ఉంది. జ్రస్పీత్ పాక్‌లోని ఐఎస్‌ఐ అనుబంధ సరఫరాదారుల ద్వారా ఈ ఆయుధాలను భారత్‌లోకి తెప్పిస్తున్నట్లు సమాచారం. రోహన్, అజయ్‌లు ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలోని గోగి గ్యాంగ్, భువూ గ్యాంగ్, కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు గ్యాంగ్‌లకు ఆయుధాలను సరఫరాచేస్తున్నారు. ఈ గ్యాంగ్‌లు సుపారీ తీసుకుని హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్నాయి.


