భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులను పెంచుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సీఎస్‌ఐఆర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చుకోవడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం కారణంగా వెలువడే కాలుష్యాన్ని నిరోధించొచ్చన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 15 శాతం కలపడం ద్వారా ఏడాదిలో 4,500 కోట్ల డాలర్ల విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చని చెప్పారు.
ఇటీవలే జపాన్‌ను దాటేసి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం తెలిసిందే. రహదారుల నిర్మాణంలో బయో బిటుమన్‌ను (పెట్రోలియం రహిత) వినియోగించడం 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా పరివర్తనాత్మక అడుగుగా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. వాణిజ్య పరంగా బయో బిటుమన్‌ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం భారత్ అని చెప్పారు. ఇది రైతుల జీవితాలను మార్చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందన్నారు.
వ్యవసాయం, నిర్మాణ రంగ సామగ్రి తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఫ్లెక్స్ ఇంజన్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించాలని కోరారు. హైడ్రోజన్ రవాణా అన్నది పెద్ద సమస్యగా పేర్కొంటూ.. ఈ విషయంలో భారత్ ఇంధన ఎగుమతిదారుగా అవతరించాలన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్ రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!


