breaking news
Arms imports
-
ఆయుధాల దిగుమతిలో మళ్లీ మనమే నెంబర్ వన్
దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచ దేశాల్లో మళ్లీ మనమే నెంబర్ వన్‌గా నిలిచాం.. 2008–12, 2013–17 మధ్య కాలంలో భారత్ ఆయుధాల దిగుమతి 24 శాతం పెరిగినట్టు స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒకవైపు చైనా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆయుధాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తుంటే... పాకిస్తాన్ ఆయుధాల దిగుమతిని గణనీయంగా తగ్గించుకుంటే భారత్ మాత్రం ఇతర దేశాల మీదే ఆధారపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గతఅయిదేళ్ల కాలంలో దిగుమతుల్ని పరిశీలిస్తే 12 శాతం భారత్ చేసుకుంటున్నవే. రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, దక్షిణకొరియా దేశాల నుంచి ఎక్కువగా ఆయుధాల్ని కొనుగోలు చేస్తోంది. ఆయుధాల దిగుమతిలో భారత్ తర్వాత స్థానాలలో సౌదీ అరేబియా, ఈజిప్టు, యూఏఈ, చైనా, ఆస్ట్రేలియా, ఇరాక్, పాకిస్తాన్, ఇండోనేసియా నిలిచాయి. ఇక మన దేశానికి అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశం రష్యా.. దేశానికి అవసరమయ్యే ఆయుధాల్లో రష్యా నుంచి 62శాతం, అమెరికా నుంచి 15 శాతం, ఇజ్రాయెల్ నుంచి 11 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్టు ఆ నివేదిక తెలిపింది. అమెరికా నుంచి 550 శాతం పెరిగిన దిగుమతులు ఒకవైపు పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. మరోవైపు డ్రాగన్ దేశం బుసలు కొడుతూ ఉంటుంది.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మన రక్షణ బడ్జెట్ క్రమంగా పెరిగిపోతోంది. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, సౌదీ అరేబియా తర్వాత రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నది భారత్ దేశమే. ఎప్పుడో ఏ దేశం నుంచి ముప్పు ఉంటుందో తెలీని పరిస్థితుల్లో మనం ఆయుధాలను దిగుమతి చేసుకోక తప్పడం లేదు. సైనికులు వాడే తుపాకులు దగ్గర్నుంచి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, జలాంతర్గాములు వంటివి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటే, ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అమెరికా నుంచి రికార్డు స్థాయిలో 550శాతం దిగుమతులు పెరిగాయి. బోయింగ్ ఏపీ–8 పెసిడోన్ యాంటీ సబ్‌మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్, సీ–17 రవాణా విమానం, ఏహెచ్–64ఈ అపాచి అటాక్ హెలికాప్టర్ల దిగుమతికి ఒప్పందం కుదుర్చుకుంది. గత 15, 16 ఏళ్ల కాలంలో ఆయుధాల ఒప్పందం కోసమే 7,500 కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఇక 2018–19 సంవత్సరానికి 2.95 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. మరో 1.08 లక్ష కోట్లు రక్షణ రంగంలో పెన్షన్లకు కేటాయించారు. మేకిన్ ఇండియా ఫలితాన్ని ఇవ్వడం లేదా ? మన రక్షణ రంగంలో ఆయుధాలన్నీ ఎప్పుడో తాతలకాలం నాటివి. అత్యంత పురాతన యుద్ధవిమానాలనే మనం ఇంకా వాడుతున్నాం. అందుకే రక్షణ రంగాన్ని ఆధునీకరించడానికి, యుద్ధవిమానాలు, జలాంతర్గాములు, తుపాకులు వంటివి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడానికి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. మేకిన్ ఇండియా వంటి కార్యక్రమంతో ఆయుధాల తయారీ రంగంలో స్వయంప్రతిపత్తి సాధించడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం 25 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేయడానికి కూడా సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేజాస్ వంటి యుద్ధ విమానాన్ని భారత్ రూపొందించినప్పటికీ దేశ అవసరాలను తీర్చగలిగే స్థాయికి ఇంకా చేరుకోలేకపోయింది. 2014 తర్వాత విదేశీ ఆయుధ కంపెనీలతో 1.3లక్షల కోట్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకుంటే, స్వదేశీ సంస్థలతో 1.17 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. 15 లక్షల మంది సాయుధ దళాల నిర్వహణకే అత్యధిక నిధులు ఖర్చు అయిపోతూ ఉండడంతో రక్షణ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేకపోతోంది. అందుకే విదేశాల నుంచి ఆయుధాల దిగుమతి తప్పనిసరైపోతోంది. -- (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆయుధ దిగుమతుల్లో భారత్ టాప్
తర్వాతి స్థానాల్లో చైనా, పాకిస్థాన్ స్వీడన్ సంస్థ ‘సిప్రి’ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కన్నా ముందుంది. ఆ దేశాల కన్నా మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ ప్రకారం... భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానం దక్కించుకుంది. భారత్‌కు ఆయుధాల విక్రయంలో అమెరికా రెండో స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అదే కాలంలో పాకిస్థాన్ ఆయుధ సంపత్తిలో 27 శాతం అమెరికానే అందించడం గమనార్హం. అయితే చైనా మాత్రం భారత ఉపఖండంలో ముఖ్యమైన ఆయుధాల విక్రయదారుగా వ్యవహరిస్తోంది. పాకిస్థాన్ ఆయుధాల దిగుమతుల్లో 54 శాతం, బంగ్లాదేశ్ ఆయుధాల దిగుమతుల్లో 82 శాతం సరఫరా చేసింది. ఇలా దక్షిణాసియాకు ఆయుధాల సరపరా ద్వారా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి అమెరికా, చైనా ప్రయత్నిస్తున్నాయని సిప్రి తన నివేదికలో పేర్కొంది. భారత్ మాత్రం తన సైనిక అవసరాలకు స్వదేశీ తయారీ పరిశ్రమ కన్నా ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ప్రస్తావించింది.