న్యూఢిల్లీ: భారత విభజన సమయంలో పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన సింధ్ అనే ప్రాంతం తిరిగి మన సరిహద్దుల్లో భాగం కావొచ్చని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సింధ్ ప్రాంతం భారతదేశంలో భాగంగా లేదు కానీ ఆ నాగరికత సౌరసత్వం అనేది మనకే అనుసంధానమై ఉన్నందును తిరిగి భారత్‌లో విలీనం అయ్యే అవకాశం ఉందన్నారు. ఢిల్లీలో ఆదివారం సింధి సమాజ్ సమ్మేళన్ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
అప్పుడు ఎప్పుడో పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన ఆ ప్రాంతం.. తిరిగి మన భారతదేశంలో భాగమవడానికి అవకాశం ఉందన్నారు. సింద్ అనేది ఎప్పటికీ మనదేనని, సరిహద్దులు అనేవి భౌగోళికంగా మారుతుంటాయన్నారు. కాగా, సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది. ఇది పాకిస్తాన్‌లోని నాలుగు ప్రధాన ప్రావిన్స్‌లలో ఒకటి. 1947లో భారత విభజన సమయంలో సింధ్ పాకిస్తాన్‌లో భాగమైంది. ఆ సమయంలో అనేక మంది సింధీ హిందువులు భారతదేశానికి వలస వెళ్లారు. సింధ్ ప్రాంతం మోహెంజోదారో వంటి పురాతన సింధు లోయ నాగరికత స్థలాలకు ప్రసిద్ధి. సింధ్ ప్రావిన్స్‌కు కరాచీ రాజధానిగా ఉంది.


