1990లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అధికారుల హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఆ హత్య సమయంలో ఎయిర్ ఫోర్స్ అధికారిని షూట్ చేసింది జేకేఎల్ఎఫ్ లీడర్ యాసిన్ మాలిక్ అని ప్రధాన సాక్షి గుర్తించారు. ఈ కేసు విచారణ టాడా కోర్టులో జరుగగా యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడని కాల్పుల సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
1990లో జమ్మూకశ్మీర్ శ్రీనగర్ పరిసరాల్లో జరిగిన నలుగురు ఎయిర్ ఫోర్స్ అధికారుల హాత్య కేసు విచారణను ప్రత్యేక టాడా కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షులను విచారించింది. ఆరోజు అధికారులను కాల్చి చంపింది జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలిక్ అనే ప్రధాన సాక్షి తెలిపారు. ఈ కేసులో మాలిక్ ను ఎలా గుర్తించారని ప్రశ్నించగా "మాలిక్ గడ్డం స్టైల్ తప్ప ప్రస్తుతం ఏమీ మారలేదు కనుక నిన్ను గుర్తించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు" అని ప్రధాన సాక్షి అన్నారు. అంతే కాకుండా ఆరోజు దాడిచేసిన మరో ముగ్గురు షౌకత్ భక్షి, నన్నాజీ, జావేద్ అహ్మద్ లను సాక్షులు గుర్తించారు. ఆరోజు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు.
అసలేం జరిగింది
1990 జనవరి 25న శ్రీనగర్ రవల్పురా వద్ద బస్సుకోసం వేచి చూస్తున్న వారిపై యాసిన్ మాలిక్ నేతృత్వంలోని టెర్రరిస్టుల బృందం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు మృతిచెందారు. కాగా ఆ ఘటనలోప్రధాన నిందితుడిగా ఉన్న యాసిన్ మాలిక్ ప్రస్తుతం టెర్రర్ ఫండింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.


