తొలి రోజు దక్షిణాఫ్రికా 247/6
కుల్దీప్‌కు 3 వికెట్లు
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్...టాస్ గెలిచిన తర్వాత తొలి వికెట్‌కు 82 పరుగుల శుభారంభం... ఆ తర్వాతా బవుమా, స్టబ్స్ కీలక భాగస్వామ్యం... అయినా సరే దక్షిణాఫ్రికా తొలి రోజును సంతృప్తికరంగా ముగించలేకపోయింది. మెరుగ్గానే మొదలు పెట్టినా ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. భారత బౌలర్లు సరైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ని నిలువరించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ పదునైన బౌలింగ్‌తో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. నేడు మిగిలిన నాలుగు వికెట్లను భారత్ ఎంత తొందరగా పడగొడుతుందో చూడాలి.
గువహటి: భారత్‌తో మొదలైన రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (112 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ తెంబా బవుమా (92 బంతుల్లో 41; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు.
ప్రస్తుతం సెనూరన్ ముత్తుసామి (25 బ్యాటింగ్), కైల్ వెరీన్ (1 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3/48) రాణించగా, బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేశాడు. కోల్‌కతా టెస్టులో ఆడిన భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. గిల్, అక్షర్ స్థానాల్లో సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి టీమ్‌లోకి వచ్చారు. దక్షిణాఫ్రికా కార్బిన్ బాష్ స్థానంలో ముత్తుసామికి అవకాశం కల్పించింది.
శుభారంభం...
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఎయిడెన్ మార్క్‌రమ్ (81 బంతుల్లో 38; 5 ఫోర్లు), ర్యాన్ రికెల్టన్ (82 బంతుల్లో 35; 5 ఫోర్లు) జాగ్రత్తగా మొదలు పెట్టారు. మార్క్‌రమ్ ఖాతా తెరిచేందుకు 17 బంతులు తీసుకున్నాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్‌రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్ వదిలేశాడు.
నితీశ్ కుమార్‌తో 4 ఓవర్లు వేయించగా అతను 21 పరుగులు ఇచ్చాడు. తొలి సెషన్‌లో ఈ భాగస్వామ్యం మరింత బలపడుతున్న దశలో బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. చక్కటి బంతితో మార్క్‌రమ్‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో టీ విరామం లభించింది. రెండో సెషన్‌లో రెండో బంతికే రికెల్టన్‌ను అవుట్ చేసి కుల్దీప్ తన విలువను ప్రదర్శించాడు.
కీలక భాగస్వామ్యం...
రెండో సెషన్‌లో స్టబ్స్, బవుమా పార్ట్‌నర్‌షిప్ దక్షిణాఫ్రికాను ఆదుకుంది. వీరిద్దరు ఓపిగ్గా చక్కటి డిఫెన్స్‌తో ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. 27 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో బవుమా అదృష్టవశాత్తూ అంపైర్ రివ్యూలో త్రుటిలో ఎల్బీగా అవుట్ కాకుండా బతికిపోయాడు. స్పిన్నర్లు ప్రభావం చూపడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది.
లంచ్ తర్వాత పూర్తిగా భారత బౌలర్ల ఆధిపత్యం కొనసాగి దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. జడేజా బౌలింగ్‌లో పేలవ షాట్‌తో బవుమా వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో స్టబ్స్, ముల్డర్ (13)లను అవుట్ చేసి కుల్దీప్ దెబ్బ తీశాడు. అయితే టోనీ జోర్జీ (59 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), ముత్తుసామి కలిసి మళ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ 45 పరుగులు జోడించారు.
అయితే కొత్త బంతితో తన తొలి ఓవర్లోనే జోర్జీని సిరాజ్ పెవిలియన్ పంపించాడు. అదే ఓవర్లో మరో నాలుగు బంతుల తర్వాత వెలుతురు మందగించడంతో నిర్ణీత ఓవర్లలో మరో 8.1 ఓవర్లు ఉండగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. దక్షిణాఫ్రికా టాప్–5 బ్యాటర్లంతా 25–49 మధ్యలోనే పరుగులు చేశారు. టెస్టు క్రికెట్‌లో ఇలా జరగడం ఇది మూడో సారి మాత్రమే.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (బి) బుమ్రా 38; రికెల్టన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 35; స్టబ్స్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 49; బవుమా (సి) జైస్వాల్ (బి) జడేజా 41; జోర్జి (సి) పంత్ (బి) సిరాజ్ 28; ముల్డర్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 13; ముత్తుసామి (బ్యాటింగ్) 25; వెరీన్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (81.5 ఓవర్లలో 6 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–82, 2–82, 3–166, 4–187, 5–201, 6–246. బౌలింగ్: బుమ్రా 17–6–38–1, సిరాజ్ 17.5–3–59–1, నితీశ్ రెడ్డి 4–0–21–0, సుందర్ 14–3–36–0, కుల్దీప్ 17–3–48–3, జడేజా 12–1–30–1.
కెప్టెన్‌లకు జ్ఞాపిక
గువహటిలో తొలి టెస్టు కావడంతో మ్యాచ్ ఆరంభానికి ముందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్టేడియం బొమ్మ ముద్రించిన చిత్రపటంపై ఇరు జట్ల కెప్టెన్లు తమ ఆటోగ్రాఫ్‌లు చేసి అస్సాం క్రికెట్ అసోసియేషన్‌కు అందించారు. అనంతరం బీసీసీఐ కార్యదర్శి, అస్సాంకే చెందిన దేవజిత్ సైకియా తమ తరఫున పంత్, బవుమాలకు ప్రత్యేక జ్ఞాపికలు అందజేశారు. అధికారిక లెక్కల ప్రకారం బర్సపర మైదానంలో తొలి రోజు 15,448 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.


