మోదీకి జోహన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో సంప్రదాయ స్వాగతం
నేడు జీ20 సదస్సులో పాల్గొననున్న ప్రధానమంత్రి
జోహన్నెస్‌బర్గ్: ప్రపంచ దేశాల అధినేతలతో ఫలవంతమైన చర్చల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కీలక అంశాలపై వారితో చర్చించబోతున్నానని తెలిపారు. జీ20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.
దక్షిణాఫ్రికా వైమానిక దళం మోదీకి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికింది. ఎయిర్‌పోర్టులో సంప్రదాయ నృత్యాలు చేసిన కళాకారులకు మోదీ అభివాదం చేశారు. జీ20 సదస్సు కోసం జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నట్లు ప్రధానమంత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడం ఇదే మొదటిసారి. 2023లో జీ20కి భారత్ సారథ్యం వహించిన సమయంలోనే దక్షిణాఫ్రికా ఈ కూటమిలో భాగస్వామిగా చేరింది.
కూటమిలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి ప్రాధాన్యతలను మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని మోదీ ఉద్ఘాటించారు. అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తులను అందించాలన్నదే ఆశయమని పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు వచ్చిన మోదీకి ప్రవాస భారతీయ చిన్నారులు స్వాగతం పలికారు. గణపతి ప్రార్థన, శాంతి మంత్రంతోపాటు వేద మంత్రాలు పఠించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, తమిళనాడు, కేరళ, బెంగాల్, రాజస్తాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను, కళారూపాలను ప్రదర్శించారు.
సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు. చిన్నారులను మోదీ అభినందించారు. భారత్–దక్షిణాఫ్రికా మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధులు అని ప్రశంసించారు. ఆయన ఈనెల 23వ తేదీ దాకా దక్షిణాఫ్రికాలో పర్యటించబోతున్నారు. జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా(ఐబీఎస్‌ఏ) ఆరో సదస్సుకు సైతం హాజరవుతారు. దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులతోనూ భేటీ అవుతారు. అయితే, ఈసారి 20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదు.


