సిద్ధమవుతున్న దేశీయ సముద్రయాన వాహనం
వచ్చే ఏడాది ఆరంభంలో సాగర మథనం
సారథ్యం వహించబోతున్న ఇద్దరు ఆక్వానాట్స్
చెన్నై: సముద్ర అంతర్భాగంలోని రహస్యాలను ఛేదించడానికి భారత ఆక్వానాట్స్ రమేశ్ రాజు, జతీందర్‌పాల్ సింగ్ సిద్ధమవుతున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ‘మత్స్య–6000’సముద్రయాన వాహనంలో వచ్చే ఏడాది ఆరంభంలో సాగర మథనం చేయబోతున్నారు. 28 టన్నుల బరువైన ఈ వాహనం సముద్రంలో 6000 మీటర్ల లోతు వరకు సునాయాసంగా ప్రయాణించగలదు. చెన్నై తీరంలో ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సముద్రంలో అత్యంత లోతునకు వెళ్లి పరిశోధనలు చేసే సామర్థ్యం ప్రస్తుతం కొన్ని దేశాలకే ఉంది. ఆ జాబితాలో భారత్ సైతం చేరబోతోంది. రమేశ్ రాజు, జతీందర్‌పాల్ సింగ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ)లో శిక్షణ పొందారు. ‘మత్స్య–6000’కు వీరిద్దరూ సారథ్యం వహించబోతున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీప్ ఓషియన్ మిషన్‌లో భాగంగానే ఈ సముద్రయానం జరుగుతోంది. రిమోట్‌తో పనిచేసే వాహనాలు, యంత్రాలను, మర మనుషులను సముద్రం లోతుల్లోకి పంపించి, అనేక పరిశోధనలు చేశారు. కొత్త విషయాల కనిపెట్టారు.
కానీ, 6 కిలోమీటర్ల లోతుకు మనుషులకు పంపిస్తుండడం మాత్రం ఇదే మొదటిసారి అని ఎన్‌ఐఓటీ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ చెప్పారు. మన ఆక్వానాట్స్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ ఆధ్వర్యంలో సముద్రయాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ సబ్‌మెర్సిబుల్ వాహనాన్ని సొంతంగానే నిర్మించడం విశేషం.
ఇందుకోసం డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్, ఇస్రో వంటి సంస్థల సహకారం తీసుకున్నామని బాలాజీ రామకృష్ణన్ వెల్లడించారు. మనకు అవరమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మనదేశంలోనే ఉన్నాయని చెప్పారు. యంత్రాలు కాకుండా నేరుగా మానవులే వెళ్తే మరిన్ని రహస్యాలను ఛేదించడానికి వీలుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానవుడి కంటికి ఏ కెమెరా కూడా ప్రత్యామ్నాయం కాదని సముద్రయాన్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణన్ పేర్కొన్నారు. సముద్ర అంతర్భాగాన్ని మరింత విస్తృతంగా శోధించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని స్పష్టంచేశారు.
నిమిషానికి 30 మీటర్ల వేగం
సముద్రాల అంతర్బాగాల్లో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. అత్యంత అరుదైన ఖనిజాలు, ఇంధనాలు, జీవవైవిధ్య వనరులకు అడ్డాగా చెప్పొచ్చు. అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే సముద్రాల లోతుల్లోకి వెళ్లి అన్వేíÙంచే సామర్థ్యం ఉంది. సముద్రయాన్ ప్రాజెక్టు విజయవంతమైతే ఆ ఘనత సాధించిన దేశాల జాబితాలోకి ఇండియా కూడా చేరుతుంది. భారత్‌కు 11,098 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరం ఉంది. దేశ ప్రగతికి సముద్ర వనరులను గరిష్టంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. ఇందుకోసమే డీప్ సీ ఓషియన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మత్స్య–6000 విశేషాలను గమనిస్తే ఇది 2.25 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకార వాహనం. బాయిలర్ స్టీల్‌తో నిర్మించారు. లిథియం–పాలీమర్ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఈ వాహనాన్ని తొలుత 500 మీటర్ల లోతు వరకు తీసుకెళ్తారు. 2027 నాటికి దీని సామర్థ్యాన్ని 10 రెట్లు పెంచుతారు. అంటే 6,000 మీటర్ల లోతుకు వెళ్లేలా అభివృద్ధి చేస్తారు. ఇది నిమిషానికి 30 మీటర్ల వేగంతో సముద్రంలోకి దూసుకెళ్లగలదు. ఇందులో కెమెరాలు, విద్యుత్ దీపాలతోపాటు మర చేతులు ఉంటాయి. వాటితో సముద్రంలో నమూనాలు సేకరిస్తారు. కొన్ని నెలల క్రితం ఫ్రెంచ్ సబ్‌మెర్సిబుల్ వాహనం నాటైల్‌లో ఇద్దరు సైంటిస్టులు సముద్రంలో 5000 మీటర్ల లోతు వరకు ప్రయాణించారు. ఆ ప్రయోగమే మత్స్య– 6000 అభివృద్ధికి స్ఫూర్తినిచి్చంది.


