తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ చివరి సినిమా జననాయగన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తున్న జననాయగన్ ఈ నెల 9న విడుదల కానుంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తన సినిమా ప్రయాణానికి ముగింపు పలికి ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తన పార్టీ సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తూ రాజకీయ రంగంలో చురుకుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా పెట్టుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. అయితే సినీ హీరోల రాజకీయ ప్రయాణం అంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. మొదట్లో ప్రజలే తనకు ముఖ్యమని, సినిమాలు తనకు ప్రాధాన్యం కాదని పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మంచి డైరెక్షన్ టీమ్ ఉండి ఉంటే తను రాజకీయాల్లోకే వచ్చే వాన్ని కాదని ప్రకటించారు. ఇలా పవన్ ఎలాగైనా తన నాలుకను మడతేస్తూ ఉంటారు. ఇప్పుడు పొత్తులో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కినా కూడా సినిమాలు మాత్రం ఆపడం లేదు.
కమల్ హాసన్ పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు విరామం ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, తిరిగి దర్శకుడిగా, నటుడిగా బిజీగా మారిపోయారు. విజయ్‌కాంత్ మంచి స్థితిలో ఉన్న కెరీర్‌ను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఒక దశలో ప్రతిపక్ష నేతగా నిలిచినా, తర్వాత పార్టీ బలహీనమైపోయింది.
విజయ్ రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతాడో చెప్పడం కష్టం. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా, కనీస స్థాయిలో సీట్లు సాధించకపోయినా, ఆయన ప్రయాణం ఇతర స్టార్ హీరోల అనుభవాలకు భిన్నంగా ఉండకపోవచ్చు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకున్న క్రేజ్, ప్రజల మద్దతు రాజకీయాల్లోకి మారడం అంత తేలిక కాదు. ఇండస్ట్రీ బంగారు బాతు లాంటిది. అయినా పదవి లేకుండా రాజకీయ వేడి తట్టుకోవడం స్టార్ హీరోలకూ పెద్ద సవాలే మరి.


