సాక్షి,హైదరాబాద్: అమెరికాలో తెలుగు యువతి గోడిశాల నిఖిత హత్యకేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిఖిత దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణమై ఉంటుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆమె మృతికి ప్రేమ వ్యవహారం కాదని, ఆర్ధిక లావాదేవీలేనని తెలుస్తోంది.
అమెరికాలో ఉంటున్న నిఖిత, తమిళనాడుకు చెందిన అర్జున్ శర్మ స్నేహితులు. అయితే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్జున్ శర్మ.. నాలుగున్నర వేల డాలర్లు అప్పుగా ఇవ్వాలని, వాటిని త్వరలోనే తీరుస్తానంటూ నిఖితను కోరాడు. అందుకు ఒప్పుకున్ననిఖిత.. అర్జున్ శర్మ అడిగిన మొత్తం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత రోజులు, నెలలు గడుస్తున్నా అర్జున్ శర్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు.
ఈ క్రమంలో తాను అప్పుగా ఇచ్చిన మొత్తం తిరిగి ఇవ్వాలంటూ అర్జున్‌పై నిఖిత ఒత్తిడి తెచ్చింది. నిఖిత ఒత్తిడి చేయడంతో అర్జున్ ముడున్నరవేల డాలర్లు ఇచ్చాడు. మిగిలిన వెయ్యి డాలర్లు ఇవ్వాలని కోరగా.. కోపోద్రికుడైన అర్జున్ బలవంతంగా మూడున్నర వేయి డాలర్లు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. అనంతరం, హత్య చేసి భారత్‌కు పరారై వచ్చాడు. నిఖిత హత్యపై సమాచారం అందుకున్న ఇంటర్ పోల్ పోలీసులు తమిళనాడులో అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే కుమార్తె మృతిపై నిఖిత తండ్రి ఆనంద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కుమార్తె మృతిపై తండ్రి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం నా కూతురు అమెరికా వెళ్ళింది. నా కూతురు నిఖితను అర్జున్ శర్మ అనే యువకుడు హత్య చేశాడు. అర్జున్ శర్మ గతంలో నా కూతురు రూమ్మెట్‌గా ఉన్నాడు. అందరినీ డబ్బులు అడిగి తీసుకునేవాడు.

నా కూతురు దగ్గర నుండి కూడా డబ్బులు తీసుకున్నాడు అని అంటున్నారు. ఆ డబ్బులు విషయంలోనే అడగడానికి అర్జున్ దగ్గరికి నిఖిత వెళ్లినట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు. నిఖితను చంపేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు.. ఆమె కనిపించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత అమెరికా నుంచి పారిపోయి ఇండియాకి వచ్చాడు.
నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాకు నా కూతురు చదువుకోడానికి వెళ్ళింది. మేరిల్యాండ్‌లో డేటా అనలిస్ట్‌గా జాబ్ చేస్తుండేంది. చివరిగా డిసెంబర్ 31న ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పింది... అదే చివరి మాట. నా కూతురికి జరిగినటువంటి అన్యాయం ఎవరికీ జరగకూడదు. అధికారులు నా కూతురు మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను’ అని విజ్ఞప్తి చేశారు.


