న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే మూడు పతకాలు నెగ్గిన భారత షూటర్ మహిత్ సంధు తాజాగా నాలుగో పతకం ఖాతాలో వేసుకుంది. శనివారం మహిళల 50 మీటర్ల రైఫిల్ ‘త్రి’ పొజిషన్‌లో మహిత్ స్వర్ణ పతకంతో మెరిసింది. ఫైనల్లో మహిత్ 456 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మహిత్‌కు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం.
దక్షిణ కొరియాకు చెందిన డైన్ జెంగ్ 453.5 పాయింంట్లతో రజతం దక్కించుకోగా... హంగేరి షూటర్ మిరా జుసన్నా బియాటోజ్‌కీ (438.6 పాయింట్లు) కాంస్యం నెగ్గింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్‌లో మహిత్ 585 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డుతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆమె నీలింగ్ పొజిషన్‌లో 194 పాయింట్లు, ప్రోన్‌లో 198 పాయింట్లు, స్టాండింగ్‌లో 193 పాయింట్లతో అదరగొట్టింది.
గతంలో 576 పాయింట్లతో తన పేరిటే ఉన్న వరల్డ్ రికార్డును మహిత్ తిరగరాసింది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్ నటాషా జోషీ 417.1 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ పోటీల్లో భారత షూటర్లు ఇప్పటి వరకు 14 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు) గెలుచుకున్నారు.


